తొందరలో భారత్ లో రష్యా కరోనా వైరస్ క్లినికల్ ట్రయల్స్ ?
By సుభాష్ Published on 9 Sep 2020 5:14 AM GMTపరిస్దితులన్నీ అనుకూలిస్తే తొందరలోనే కరోనా వైరస్ కు విరుగుడుగా మనదేశంలో క్లినికల్ ట్రయల్స్ ప్రయోగాలు మొదలయ్యే అవకాశాలున్నాయి. రష్యాలో తయారైన స్పుత్నిక్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రయోగాలను మన దేశంలో జరిపేందుకు అనుమతి ఇవ్వాలంటూ రష్యా ప్రభుత్వం భారత్ ప్రభుత్వాన్ని కోరటం విశేషం. ఒకవేళ రష్యా విజ్ఞప్తికి మనదేశం గనుక సానుకూలంగా స్పందిస్తే వెంటనే క్లినికల్ ట్రయల్స్ రూపంలో మనదేశంలో కూడా కరోనా వైరస్ జనాలకు అందుబాటులోకి రావటం ఖాయం.
యావత్ ప్రపంచం కరోనా వైరస్ కు విరుగుడు మందు లేనికారణంగా నానా ఇబ్బందులు పడుతున్న విషయం అందరు చూస్తున్నదే. ఇందులో భాగంగానే రష్యాతో పాటు అమెరికా, బ్రిటన్ దేశాల్లో వైద్య నిపుణులు, శాస్త్రజ్ఞులు, ఫార్మా కంపెనీలతో కలిసి కరోనాకు విరుగుడు మందు కనిపెట్టటంలో తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే రష్యాలో నిపుణులు ఈ విషయంలో ముందంజ వేశారు. వైరస్ కు విరుగుడు మందు కనిపెట్టినట్లు ప్రకటించి దానికి స్పుత్నిక్ అనే పేరు కూడా పెట్టారు.
మొదట్లో స్పుత్పిక్ ను రష్యా అధ్యక్షుడు పుతిన్ తో పాటు ఆయన కూతరు+మరికొందరికి ట్రయల్స్ రూపంలో అందించారు. ఈ ప్రయోగం సక్సెస్ అయినట్లు రష్యా ప్రభుత్వం ప్రకటించింది. దాంతో ఇదే మందును రష్యా రాజధాని మాస్కోలోని కొన్ని వేలమందికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మాస్కోలో కూడా వ్యాక్సిన్ విజయవంతం కాగానే ప్రపంచానికి పరిచయం చేసే ఆలోచనలో ఉంది. ఇందులో భాగంగానే మొదట తాము తయారు చేసిన వ్యాక్సిన్ ను భారత్ లో కూడా క్లినికల్ ట్రయల్స్ రూపంలో జనాలకు అందించేందుకు రష్యా ప్రభుత్వం అనుమతులు కోరింది.
మన ప్రభుత్వం గనుక రష్యా కోరికకు సానుకూలంగా స్పందిస్తే ఇక్కడ కూడా ఏదో రూపంలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావటం ఖాయం. ఒకసారి వ్యాక్సిన్ విజయవంతం అయ్యిందంటే పెద్ద ఎత్తున మందును తయారు చేసి జనబాహుళ్యంలోకి అందించటానికి ప్రయత్నాలు మొదలవుతాయి. ఇదే విషయంపై నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ మాట్లాడుతూ క్లినికల్ ట్రయల్స్ ను భారత్ లో చెప్పటేందుకు రష్యా అనుమతులు కోరినట్లు చెప్పాడు. ఇదే సమయంలో మనదేశంలోని శాస్త్రజ్ఞులు కూడా కరోనా వైరస్ కు విరుగుడు మందు తయారీలో విశేష కృషి చేస్తున్నట్లు చెప్పాడు. అలాగే మనదేశంలోని ఫార్మా కంపెనీలు కరోనా విరుగుడు వ్యాక్సిన తయారీకి రష్యా అధికారులతో చర్చిస్తున్నట్లు చెప్పాడు. ఏదేమైనా యావత్ ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ కు తొందరలోనే విరుగుడు మందు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి, మంచిదేగా !