టీఈఏ మ‌ద్ద‌తు కోరిన ఆర్టీసీ జేఏసీ

By Medi Samrat
Published on : 16 Oct 2019 2:20 PM IST

టీఈఏ మ‌ద్ద‌తు కోరిన ఆర్టీసీ జేఏసీ

లిబర్టీలోని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యాలయంలో టీఈఏ నాయకులను ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వథామ రెడ్డి బృందం క‌లిసింది. ఈ సంద‌ర్భంగా అశ్వథామ రెడ్డి బృందం టీఈఏ నాయ‌కుల‌ను ఈనెల‌ 19న జ‌రిగే రాష్ట్ర బంద్ కు సహకరించాలని కోరారు. ఈ సంద‌ర్భంగా టీఈఏ అధ్య‌క్షుడు సంపత్ కుమార్ స్వామి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు ప్ర‌క‌టించారు. అలాగే.. ఆర్టీసీ కార్మికులు ఇద్దరు ఆత్మహత్యలు చేసుకోవడం ఎంతో విచారకరమ‌ని.. ఎవరు ఆత్మహత్యలు చేసుకోకుండా పోరాటాలతో హక్కులను సాధించుకుందామ‌ని అన్నారు. మిగతా ఉద్యోగ సంఘాలను, ఉపాధ్యాయ సంఘాలను సంఘటితంగా ఏకం చేసి పోరాటం ఉధృతం చేస్తామని అన్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించినందుకు టీఈఏ కు అశ్వథామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రోజురోజుకు మీ అందరి మద్దతు పెరగడంతో తమకు ఆత్మస్థైర్యం పెరిగిందని.. భవిష్యత్ లో ఎవరికి ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైన మా ఆర్టీసీ జేఏసీ పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు.

Next Story