హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నాయకులు భవిష్యత్తు కార్యచరణను ప్రకటించారు. ఇవాళ్టితో ఆర్టీసీ కార్మికుల సమ్మె 15వ రోజుకు చేరుకుంది. శనివారం బంద్‌ విజయవంతమైందని ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో జేఏసీ నేతలు సమావేశమయ్యారు. అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వి.ఎస్‌ రావుతో పాటు పలువురు నేతలు సమావేశంలో పాల్గొన్నారు. బంద్‌కు మద్దతు తెలిపిన అన్ని వర్గాల ప్రజలకు, ఉద్యోగ సంఘాలకు ఆర్టీసీ కార్మిక నేతలు ధన్యవాదాలు తెలిపారు. సమ్మె కార్మికులది మాత్రమే కాదని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు జరుగుతున్న పోరాటమని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. రేపు అన్ని డిపోల వద్ద ప్లకార్డులతో నిరసన తెలపాలన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహస్తోందని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఢిల్లీలో కూడా ఆందోళన జరిగిందని అశ్వత్థామరెడ్డి వెల్లడించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.