తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం తోపాటు 26 డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు స‌మ్మెకు దిగిన విష‌యం తెలిసిందే. దాదాపు 40 రోజుల‌కు పైగా త‌మ‌పోరాటం కొనసాగించిన ఆర్టీసీ కార్మికులు ఎన్నో రాజ‌కీయ ప‌రిణామాల మ‌ధ్య ఆర్టీసీ సమ్మెను విరమిమ‌ని ప్రకటించారు. హైకోర్టులో విచార‌ణ కొన‌సాగిన అనంత‌రం ఆర్టీసీ కార్మికులు అందరూ విధుల్లో చేరితే వారికీ ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈ నేప‌థ్యంలో హైకోర్టు సూచించిన మేరకే ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరుతామని, వారికి ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని అలా అయితే సమ్మె విరమిస్తాం అంటూ ఆర్టీసీ జేఏసీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే అయితే 47 రోజుల పాటు కొనసాగి, సమ్మె విరమణ ప్రకటన చేసింది.

ఇదిలా ఉండగా అటు ఆర్టీసీ జేఏసీ సమ్మే విరమిస్తున్నామని కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి చేర్చుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పంద‌న రాలేదు. కార్మికుల సమ్మె విరమించిన నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్న అనేదానిపై ప్రస్తుతం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి నెల‌కొంది. ఇప్పడి వరకు కేసీఆర్ స‌ర్కార్‌ మాత్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోబోతున్నామ‌ని ప్ర‌క‌ట‌న మాత్రం చేయ‌లేదు.

5100 రూట్ల‌ను ప్రైవేటీక‌ర‌ణ స‌ర్కార్ సిద్ధం:

అంతేకాకుండా ఆర్టీసీ కార్మికుల సమ్మె నేప‌థ్యంలో ఇప్పటికే ప్రభుత్వం ఆర్టీసీలోని 5100 రూట్లను ప్రైవేటీకరణ చేస్తున్నామంటూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందుకు హైకోర్టు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. అటు ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు డిపోల వద్ద క్యూలు క‌ట్టిన‌ప్ప‌టికీ, డిపో మేనేజర్లు మాత్రం వారిని వెన‌క్కి పంపించేశారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత విధుల్లో చేర్చుకుంటామని తేల్చి చెప్పారు.ఇక చేసేదేమి లేక ఆర్టీసీ డిపోల వ‌ద్ద‌కు వెళ్లిన కార్మికులు చివ‌ర‌కు నిరాశ‌తో వెనుదిరిగారు. కార్మికుల నిర్ణ‌యంపై గులాబీ బాస్ నుంచి ఎలాంటి ఆదేశాలు వ‌స్తాయోన‌ని ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు.

మ‌రో ఉద్య‌మానికి రెడీ అవుతున్న కార్మికులు:

అయితే కార్మికులు సమ్మె విరమించినప్పటికీ కేసీఆర్ స‌ర్కార్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆర్టీసీ జేఏసీ మరో ఉద్యమానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం స్పందించకపోతే సేవ్ ఆర్టీసీ పేరుతో మరో ఉద్యమాన్ని ప్రారంభిస్తామ‌ని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్ప‌స్టం చేశారు. రేపటి నుంచి అన్ని డిపోల వద్ద సేవ్ పేరుతో భారీ ర్యాలీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. త‌మ స‌మ్మె విష‌యంలో ప్రభుత్వ నుంచి ఎలాంటి స్పంద‌న రాక‌పోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి సమ్మెను తీవ్ర‌త‌రం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ నేపథ్యంలో మరోసారి తెలంగాణ లో ఆర్టీసీ కార్మికుల స‌మ్మె సైరన్ మోగించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి కార్మికుల మ‌రో ఉద్య‌మం ప్ర‌క‌ట‌న‌తో కేసీఆర్ స‌ర్కార్ దిగి వ‌స్తుందా..? లేక కార్మికుల ఉద్య‌మం మ‌రింత ఉధృతం చేస్తారా..? అనేది తేలాల్సి ఉంది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.