ముఖ్యాంశాలు

  • ఆర్టీసీ కార్మికుల ‘ఛలో ట్యాంక్‌ బండ్’
  • ట్యాంక్‌ బండ్‌పై భారీగా మోహరించిన పోలీసులు
  • తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న ముందస్తు అరెస్ట్‌లు
  • ‘ఛలో ట్యాంక్‌ బండ్’ నిర్వహించి తీరుతామంటున్న కార్మికులు

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. ఇవాళ ఆర్టీసీ సమ్మె భవిష్యత్తు కార్యచరణలో భాగంగా జేఏసీ నేతలు ఛలో ట్యాంక్‌ బండ్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్యాంక్‌ బండ్‌పై పోలీసులు భారీగా మోహరించారు. ట్యాంక్‌ బండ్‌ వైపు వచ్చే అన్ని దారులను పోలీసులు మూసివేశారు. అలాగే కార్మికులను ట్యాంక్‌బండ్‌ చేరుకోకుండా పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. ఇప్పటికే జేఏసీ ముఖ్య నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరి కొంత కార్మిక నేతలు అజ్ఞాతంలోకి వెళ్లారు. అఖిలపక్ష నాయకులను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ వచ్చే అన్ని దారుల్లోను పోలీసులు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేస్తున్నారు. మరోవైపు ఎట్టిపరిస్థితుల్లోనూ ఛలో ట్యాంక్‌ బండ్‌ నిర్వహించి తీరుతామని ఆర్టీసీ కార్మికులు చెపుతున్నారు. ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన ఛలో ట్యాంక్‌ బండ్‌ కార్యక్రమం నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత విక్రమ్‌ గౌడ్‌ను ముందస్తు అరెస్ట్‌ చేశారు. అర్థరాత్రి 12 గంటలకు ఇంట్లోకి వచ్చి విక్రమ్‌ గౌడ్‌ను పోలీసులు జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు తరలించారు.

సకల జనుల సామూహిక దీక్షలో భాగంగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని ఎంబీ భవన్‌ నుంచి సీపీఎం నాయకులు తమ్మినేని వీరభద్రం, విమలక్క, సీపీఎం నాయకులు ర్యాలీ చేపట్టారు. ఆర్టీసీ క్రాసూ్‌ రోడ్‌లో పోలీసుల వలయాన్ని చేధించుకొని ట్యాంక్‌ బండ్‌ వైపు పోలీసులు పరుగులు తీశారు.

ట్యాంక్‌బండ్‌పై ఉదయం 6 గంటల నుంచే వాహనాల రాకపోకలను పోలసులు నిలిపివేశారు. ఆర్టీసీ ఛలో ట్యాంక్‌ బండ్‌ సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే రూట్లను పోలీసులు మళ్లీస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ట్యాంక్‌ బండ్‌పై రాకపోకలు బంద్‌. సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌ వచ్చే వాహనాలను కవాడిగుడా వైపు మళ్లీస్తున్నారు. ఆర్టీసీ క్రాస్‌ నుంచి ఇందిరా పార్కు వచ్చే వాహనాలు అశోక్‌నగర్‌ నుంచి మళ్లీస్తున్నారు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ వైపు వెళ్లే వాళ్లు వేరే రహదారి చూసుకోవాలని పోలీసులు సూచించారు. హిమాయత్‌నగర్‌ నుంచి ట్యాంక్‌ బండ్‌ వచ్చే వాహనాలను బషీర్‌ బాగ్‌ వైపుకు మళ్లీస్తున్నారు. ఓల్డ్‌ ఎమ్మెల్యే రూట్‌ నుంచి వచ్చే వాహనదారులను పీసీఆర్‌ జంక్షన్‌ దగ్గర ట్రాఫిక్‌ పోలీసులు దారి మళ్లీస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.