నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. తనపై దాడికి యత్నించింది టీడీపీ గుండాలేనని ఆరోపించింది. కాగా, నీరుకొండ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ సమ్మిట్‌లో పాల్గొన్న రోజాను కొందరు మహిళలు, రైతులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అమరావతికి న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలు, రైతుల ఆందోళనతో పోలీసులు అప్రమత్తమై రోజాను వెనుక గేటు నుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఆందోళనకారులు రోజా కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డగించారు. ఈ ఆందోళనతో యూనివర్సిటీ వద్ద కొంత సేపు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

కాగా, రోజా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనపై దాడికి యత్నించింది టీడీపీ గుండాలేనని, ఇదంతా పక్కాప్లాన్‌ ప్రకారమే చేశారని రోజా ఆరోపించారు. చంద్రబాబు ఇకనైనా ఇలాంటి కుళ్లు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. అమరావతి రైతులను మోసం చేసింది తాము కాదని, వారిని నిలువునా మోసం చేసింది చంద్రబాబేనని, ముందుగా ఆయనను అడ్డుకోవాలని అన్నారు. టీడీపీ నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాము అభివృద్ధి చేస్తున్నామనే అక్కాసుతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పించారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.