ఆ విధ్వంస‌క‌ర‌ ఇన్నింగ్స్‌కు ఐదేళ్లు..!

By Medi Samrat
Published on : 13 Nov 2019 6:15 PM IST

ఆ విధ్వంస‌క‌ర‌ ఇన్నింగ్స్‌కు ఐదేళ్లు..!

రోహిత్‌ శర్మ.. ఈ పేరుకు ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. దేశ‌వ్యాప్తంగా చాలామందికి క్రికెట్ తెలుసు.. కానీ క్రికెట్ తెలిసిన అంద‌రికీ రోహిత్ తెలుసు అంటే అతిశ‌యోక్తికాదేమో.! క్రికెట్ అభిమానులు 'హిట్‌మ్యాన్' అంటూ ఇష్టంగా పిలుచుకునే రోహిత్ శ‌ర్మ కెరీర్‌లో ఓ అరుదైన మైలురాయిని సాధించిన రోజు ఇది. క‌చ్చితంగా ఇది రోహిత్ అభిమానుల‌కు పండుగ రోజే.

Image result for rohit sharma 264

వన్డే క్రికెట్‌లో డబుల్‌ సెంచరీ చేయ‌డ‌మే గొప్ప‌. అలాంటిది అవలీలగా మూడు సార్లు డ‌బుల్ సెంచ‌రీలు సాధించి వారెవ్వా అనిపించుకున్నాడు. వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లోనే వ్య‌క్తిగ‌త‌ అత్య‌ధిక స్కోర్ గా రికార్డుల్లో ఉన్న‌ రోహిత్ డబుల్‌ సెంచరీ.. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో న‌మోదైంది. రోహిత్ శ్రీలంక బౌల‌ర్ల‌కు విశ్వరూపం చూపించి 264 పరుగులు చేసిన ఆ మ్యాచ్‌ జరిగి నేటికి ఐదేళ్లు పూర్తయింది.

Image result for rohit sharma 264

ఈ సందర్భంగా రోహిత్ ఇన్నింగ్సును ఐసీసీ, బీసీసీఐ గుర్తుచేసింది. ఈ సంధ‌ర్బంగా రోహిత్‌కు శుభాకాంక్షలు తెలిపింది. ఇక రోహిత్ ఇన్నింగ్స్ లోకి వెళ్తే.. ఆ మ్యాచ్‌లో 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్ల సహాయంతో 264 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్‌లో అప్ప‌టి వ‌ర‌కూ అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న‌ రికార్డును రోహిత్ బ్రేక్‌ చేశాడు. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కుచెదరలేదు.

Image result for thisara perera

అయితే.. ఆ మ్యాచ్‌లో రోహిత్‌.. నాలుగు పరుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద ఇచ్చిన‌ క్యాచ్‌ను శ్రీలంక ఆల్‌రౌండర్‌ తిశార పెరీరా నేలపాలు చేశాడు. దీంతో శ్రీలంక భారీ మూల్యం చెల్లించుకుంది. ముఖ్యంగా ఆ క్యాచ్‌ వదిలేసినందుకు పెరీరా క్రికెట్ కెరీర్‌లోనే అత్యంత గుర్తుంచుకోద‌గ్గ రోజుగా మిగిలిపోతుంది. ఇక రోహిత్‌ సునామీ ఇన్నింగ్స్‌కు టీమిండియా నాలుగు వందలకుపైగా స్కోర్‌ సాధించింది. ఈ మ్యాచ్‌లో 153 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.

Image result for rohit sharma 264

రోహిత్ కెరీర్ లో తొలి డబుల్‌ సెంచరీ 2013లో నవంబర్‌ 2న ఆస్ట్రేలియాపై సాధించాడు. ఇక ఆ తర్వాతి ఏడాదే శ్రీలంకపై 264ల‌తో ఈ గ‌ణ‌మైన రికార్డును సాధించాడు. అనంతరం 2017లో లంకపై మరోసారి శివాలెత్తాడు. ఆ మ్యాచ్‌లో ఏకంగా 208 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ట్రిపుల్‌ డబుల్‌ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.



Next Story