విండీస్‌ జట్టుపై ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ శర్మ ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా ఆ జ‌ట్టు కెప్టెన్‌ పొలార్డ్ ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు. ఐపీఎల్ లో ముంబ‌యి జ‌ట్టుకు ప్రాతినిథ్యం వ‌హించ‌డం వ‌ల‌న‌ పొలార్డ్‌ గురించి అన్ని విష‌యాలు క్షుణ్ణంగా తెలుసన్నాడు.

అంతేకాదు.. 2019 ఐపీఎల్‌లో తాను ఓ మ్యాచ్‌కు అందుబాటులో లేని నేఫ‌థ్యంలో పొలార్డ్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడ‌ని.. ఆ టైంలో అతడి వ్యూహాలు, తపన, మైదానంలో తోటి ఆట‌గాళ్ల‌తో న‌డుచుకునే విధానం దగ్గర్నుంచి చూశానని రోహిత్ అన్నాడు. కెప్టెన్‌గా పోలార్డ్.. ఆత్మవిశ్వా​సంతో, సహచర ఆటగాళ్లపై ఎంతో నమ్మకంగా వ్యవహరిస్తాడన్నాడని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు.

ఇక‌పోతే.. విండీస్ టీ20ల్లో బ‌ల‌మైన‌ జట్టని, జ‌ట్టులోని ప్రతీ ఆటగాడు క్షణాల్లో మ్యాచ్ స్వ‌రూపాన్నే మార్చేస్తార‌ని.. ఆ జట్టులోని దాదాపు అందరు ఆటగాళ్లు అన్ని దేశాల‌లోని టీ20 లీగ్‌లు ఆడుతున్నారన్నాడు. మ‌నం వారి ఆట‌తీరును ప‌రిశీలిస్తే ప్రతి రెండు బంతులకో ఒక సిక్సర్‌ కొట్టడానికి వారు ప్రయత్నిస్తార‌ని అన్నాడు. అందుకే విండీస్‌తో టీ20 సిరీస్‌ అంటే ఛాలెంజింగ్‌గా తీసుకున్నామ‌ని.. అయితే ప్ర‌త్య‌ర్థులెవ‌రైనా.. మేం ఎవ‌రికి భయపడమని రోహిత్ తెలిపారు.

ఇదిలావుంటే.. మూడు టీ20ల సిరీస్‌లో విండీస్‌, టీమిండియా త‌లో మ్యాచ్‌లో గెలిచాయి. సిరీస్ ఫ‌లితం తేలే చివ‌రి టీ20 ముంబాయిలోని వాంఖ‌డే వేదిక‌గా రేపు జ‌రుగ‌నుంది. సిరీస్ గెలిచి ఎవ‌రు విజేత‌గా నిలుస్తారో చూడాలి మ‌రి..!

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.