కర్నాటక ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరిపై మరోమారు బదిలీ వేటు పడింది. రాష్ట్ర భవన నిర్మాణ సంక్షేమ శాఖ నుంచి ఆమెను మరో శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింధూరిపై బదిలీ వేటు పడటం వరుసగా ఇది నాలుగో సారి.

రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గని నిజాయితీ గల అధికారిణిగా రోహిణి సింధూరికి మంచి పేరుంది. కర్నాటకలో ఆమెను ‘లేడీ సింగం’ అని కూడా పిలుచుకుంటుంటారు.

కర్నాటక వరదల నేపథ్యంలో రూ.1000 కోట్ల భవన నిర్మాణ సంక్షేమ శాఖ నిధులను.. విపత్తు సహాయ నిధికి మళ్లించాలని కర్నాటక బీజేపీ ప్రభుత్వం రోహిణి సింధూరిని కోరినట్లు సమాచారం. అందుకు ఆమె నిరాకరించారు.

రోహిణి సింధూరి నిరాకరణ యడియూరప్పకు ఆగ్రహం తెప్పించినట్లు తెలిసింది. అందువల్లే ఆమెపై తాజాగా ఈ బదిలీ వేటు పడినట్లు సమాచారం. ఇదిలావుంటే.. ప్రభుత్వం సెప్టెంబర్ 20న ఆమెను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 24న ఆమెను పట్టు పరిశ్రమ శాఖకు బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.