కరోనా రోగుల సేవలో రోబోలు

By Newsmeter.Network  Published on  2 April 2020 5:30 AM GMT
కరోనా రోగుల సేవలో రోబోలు

ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్ల కోసం ఇక హ్యూమనాయిడ్ రోబోలు రంగంలో దిగబోతున్నాయి. ఐసొలేషన్ కేంద్రాలు, క్వారంటైన్లలో వాటి సేవలను విస్తృతంగా వినియోగించుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆస్పత్రులలో రోబోలను ఉపయోగించేందుకు ఇప్పటికే పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. మనుషులు వెళ్లలేని, వెళ్లకూడని చోట్లకు రోబోలను పంపి విధులు నిర్వర్తించేందుకు ప్లాన్ చేస్తున్నారు. చైనాలోని వూహాన్‌లో కరోనా కేసులకు ఆస్పత్రులలో రోబోలనే వాడారు. రోగుల శరీర ఉష్ణోగ్రతను కొలిచేందుకు, మందులు అందించేందుకు, రోగి ఉన్న ప్రాంతాలను శుభ్రం చేసేందుకు అవి సహాయపడ్డాయి. అంతే కాదు రోగి ముక్కు, గొంతు నుంచి టెస్ట్‌ శాంపిళ్లను సేకరించడానికి రోబోలు ఉపయోగపడ్డాయి.

Also Read :షుగర్ వ్యాధి ఉన్న వారు ‘క్యారెట్’ తీసుకుంటే ప్రమాదమా..?

ఇక మనదేశంలో జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా వైద్యులకు చికిత్సతో పాటుగా ఆహారం, మందులు అందించేందుకు హ్యూమనాయిడ్‌ రోబోలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. దీనివల్ల వైద్యులకు, వైద్య సిబ్బందికి వైరస్‌ సోకే ముప్పు గణనీయంగా తగ్గుతుందని ఆస్పత్రి అధికారులు తెలిపారు. కేరళకు చెందిన ఓ స్టార్టప్‌ కంపెనీ నిపుణులు రెండు రోబోలు తయారు చేశారు. వీటిలో ఒక రోబో శానిటైజర్‌లు, తదితరాలను అందిస్తుండగా, మరోకటి వైరస్‌ గురించి ప్రజలకు అవగాహన కలిగిస్తోంది. తమిళనాడు, రాజస్థాన్ లలో కూడా నర్సింగ్ రోబోలను రంగంలోకి దించాయి.

శానిటైజర్ స్ప్రే చేసేందుకు డ్రోన్ లను తయారు చేసిన ఐఐటీ గౌహతికి చెందిన పరిశోధకులు ఇప్పుడు రోగులకు సేవలందించేందుకు రెండు రోబోలను అభివృద్ధి చేస్తున్నారు. కరోనా పాజిటివ్‌ రోగులకు ఆహారం, మందులు అందించడం, వ్యర్థాలను సేకరించడంవంటి పనులను ఈ రోబోలు చేపడతాయి.

Also Read : నిద్రపోయాడు.. లేచి చూసేసరికి అద్భుతం.. అలాఎలా జరిగింది?

రెండు వారాల్లో ఈ రోబోలకు సంబంధించిన నమూనాలు తయారవుతాయని, అనంతరం సంస్థ ఆస్పత్రిలో, వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చే సెంటర్‌ ఆఫ్‌ నానోటెక్నాలజీలో టెస్ట్‌ రన్‌ నిర్వహిస్తామని తెలిపారు. ఇవి పూర్తయిన తర్వాత రోబో ఆధారిత స్క్రీనింగ్‌ యూనిట్ల తయారీని కూడా చేపట్టే ప్రణాళికలున్నాయని పేర్కొన్నారు. అంతే కాదు వైరస్‌ను గుర్తించి, చికిత్స అందించేందుకు ఈశాన్య రాష్ట్రాలకు ఉపకరించే రీతిలో కోవిడ్‌-19 విశ్లేషణ కోసం ఆధునిక పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పేందుకు ఐఐటీ గౌహతి సంసిద్ధమైంది.

హ్యూమనాయిడ్ రోబోల సేవలను విస్తారంగా వినియోగంలో రావడంమంటూ జరిగితే- హెల్త్ కేర్ వర్కర్లు, నర్సులపై ప్రస్తుతం ఉన్న తీవ్ర ఒత్తిడి నుంచి కాస్తయినా ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు రోగులకు దూరంగా ఉంటూ చికిత్స అందించడంలో రోబోలు భారత వైద్యులకు ఎంతో ఉపకరిస్తాయి.

Next Story