బ్రేకింగ్‌: బస్సు - ట్రక్కు ఢీకొని ఏడుగురు కూలీలు మృతి

By సుభాష్  Published on  5 Sep 2020 4:11 AM GMT
బ్రేకింగ్‌: బస్సు - ట్రక్కు ఢీకొని ఏడుగురు కూలీలు మృతి

దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాల నివారణకు ఎన్ని చర్యలు చేపట్టినా.. అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయపూర్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న బస్సు చెరీఖడీ సమీపంలో ఒక ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

ఈ బస్సు ఒడిశాలోని గంజాం నుంచి గుజరాత్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను ఇంకా గుర్తించాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు ఘటన స్థలంలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జు అయ్యింది.

కాగా, నిన్న నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ – నాగార్జునసాగర్‌ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. చింతపల్లి మండలం ధైర్యపురి తండా వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడటంతో వాహనంలో ఉన్న ఐదుగురు మృతి చెందారు. మృతులు కారులో హైదరాబాద్‌ నుంచి మల్లెపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే డ్రైవర్‌ నిద్రలోకి జారుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

అలాగే గురువారం కూడా సిద్దిపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మంచిర్యాల జిల్లా తాండూరు గ్రామ సర్పంచ్‌ అంజిబాబుతో పాటు మరో ఇద్దరు మృతి చెందారు. కారు ముందు భాగం లారీ కిందికి దూసుకెళ్లడంతో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ప్రమాదం కూడా డ్రైవర్‌ నిద్రలో ఉండటం వల్ల జరిగినట్లు పోలీసుల ప్రాథమికంగా భావించారు.

అలాగే బుధవారం వరంగల్‌ జిల్లాలో కూడా ఘోర ప్రమాదమే జరిగింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా దామెర మండలం పసరగొండ ఇసుక లారీని కారు ఢీకొట్టడంతో ఐదుగురు ఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచారు. ఇలా రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నారు. అజాగ్రత్త, వాహనాలు నడుపుతూ నిద్రలోకి వెళ్లడం, మద్యం సేవించి వాహనాలు నడపటం ఇలాంటి కారణాల వల్ల ప్రమాదాలు జరిగిన అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రమాదాలు జరుగకుండా ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోతోంది.Next Story