టీఆర్‌ఎస్‌ విజయం బ్రేకింగ్‌ న్యూస్‌ కాదూ..

By Newsmeter.Network  Published on  25 Jan 2020 6:17 PM IST
టీఆర్‌ఎస్‌ విజయం బ్రేకింగ్‌ న్యూస్‌ కాదూ..

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల గురించి, నిర్వహణ గురించి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందన్నాడు. రాష్ట్రంలో 25కు పైగా మున్సిపాలిటీల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి 50 శాతం సీట్లు రాలేదని విమర్శించారు. కారు గుర్తుకు తెలంగాణ సమాజం బ్రహ్మరథం పట్టిందని వార్తా ఛానెళ్లు ఎలా ప్రసారం చేస్తాయని ఆయన ప్రశ్నించారు. ‘సరిలేరు నీకెవ్వరూ’ అంటూ సీఎం కేసీఆర్‌కు భజన చేయడానికి కొన్ని న్యూస్ ఛానెళ్లు అమితాసక్తి కనబరుస్తున్నాయని ధ్వజమెత్తారు.

ఏ ఎన్నికల్లో అయినా సిఎం కెసిఆర్‌ ఎన్నుకున్న ఆయుధం ‘బ్లాక్ మెయిల్’ అని ఆరోపించారు. 120 మున్సిపాలిటీల్లో, 10 కార్పొరేషన్లలో టిఆర్‌ఎస్‌ ఓడిపోతే పదవులు ఊడిపోతాయని తమ మంత్రులను స్వయంగా కెసిఆర్‌ బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. బ్లాక్ మెయిల్ ఆయుధాన్ని మంత్రులకు ఇచ్చి అచ్చోసిన ఆంబోతుల్లా వారిని ప్రజలపైకి వదిలితే, ఈ ఆంబోతులు ప్రజలపై, ప్రతిపక్షాలపై, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద దాడులు, బెదిరింపులు, కేసులు బనాయించడం ద్వారా ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నం చేశారన్నారు.

రాష్ట్రంలో ఎక్కడా తిరగనని కేటీఆర్ చెప్పారని ఒక సిరిసిల్లలోనే ప్రచారం చేసుకున్నారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేటీఆర్ ప్రచారం చేసిన సిరిసిల్లలో ఆయనకు, టీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా 10 మంది స్వతంత్రులు గెలిచారని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లోనూ టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా 6 మంది స్వతంత్రులు గెలిచారని తెలిపిన రేవంత్ రెడ్డి.. బ్రేకింగ్ న్యూస్ ఇదని చెప్పారు. ‘కేసీఆర్, కేటీఆర్‌కు వాళ్ల సొంత నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఎదురైతే.. మీ న్యూస్ ఛానెళ్లలో కనీసం ఒక్క లైన్ స్క్రోలింగ్ అయినా పెట్టారా?’ అని రేవంత్ ప్రశ్నించారు.

ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ.. ప్రభుత్వ పథకాలనో, కార్యకర్తలనో నమ్ముకొని విజయం సాధించలేదని.. డబ్బులు, మద్యం, పోలీసులు, అధికారుల మీద ఆధారపడి నెగ్గారని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రకటన నుంచి రిజర్వేషన్లు, ఎన్నికల తేదీలు, ఫలితాలు అన్నింట్లో అడ్డగోలుగా నియమ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. కాంగ్రెస్‌‌కు నష్టం చేకూర్చేవిధంగా ప్రవర్తించారని మండిపడ్డారు. బ్యాలెట్ పేపర్లను కూడా మాయం చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలిచినట్లు ప్రకటించారని సంచలన ఆరోపణలు చేశారు.

హుజూర్ నగర్ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే బస్సు ఛార్జీలు, మందు ధరలు పెరుగుతాయని ప్రజలను హెచ్చరించామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అయినా వినకుండా అధికార పార్టీనే గెలిపించారని.. ఆ కొద్ది రోజులకే ఫలితాన్ని చూశారని చెప్పారు. కనీసం ఈ ఎన్నికల్లో అయినా గెలిపిస్తారని చూస్తే.. ఏవేవో కారణాలతో టీఆర్‌ఎస్ పార్టీయే గెలిచిందని.. త్వరలోనే విద్యుత్ చార్జీలు డబుల్, ఇంటి పన్ను ఆరంతలు పెరుగుతుంది. మిషన్ భగీరథ నీరుకు నాలుగంతలు పెంచి బిల్లు వసూలు చేస్తారన్నారు. టిఆర్ఎస్ గెలుపు ప్రజలకు పన్నుల మోత మోగించబోతుందని తెలిపారు.

Next Story