మంత్రి జ‌గ‌దీశ్‌కి సారాలో సోడా క‌ల‌ప‌డం త‌ప్ప ఏమీ తెలీదు : రేవంత్ రెడ్డి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Jun 2020 11:43 AM GMT
మంత్రి జ‌గ‌దీశ్‌కి సారాలో సోడా క‌ల‌ప‌డం త‌ప్ప ఏమీ తెలీదు : రేవంత్ రెడ్డి

ఆదివారం న‌ల్ల‌గొండ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో నియంత్రిత సాగు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక స‌మావేశంలో మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డిల మ‌ధ్య మాట‌ల యుద్దంపై కాంగ్రెస్ నాయ‌కులు రేవంత్ రెడ్డి స్పందించారు. నిన్న నల్గొండ జిల్లాలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి తన స్థాయిని మరిచి బజారు రౌడీలా వ్యవహరించారని రేవంత్ రెడ్డి అన్నారు.

మంత్రి జగదీష్ రెడ్డికి చెప్పదానికి ఏమిలేకనే ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పై విమర్శలు చేశార‌ని అలా చేయడం కరెక్ట్ కాదన్నారు. జగదీశ్‌ రెడ్డికి కుస్తీలు పట్టాలని ఉంటే.. ఏ గ్రౌండ్ ర‌మ్మంటారో చెబితే అక్క‌డికి కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు వ‌స్తార‌న్నారు. మంత్రి జాగ్రత్తగా ఉండాల‌ని, ఇలా అడ్డగోలుగా మాట్లాడితే పడేవారు ఎవ్వరూ లేరన్నారు. జగదీష్ రెడ్డి కి సారాలో సోడా కలపడం తప్ప ఏమీ తెలీదని చెప్పారు. ఆయనకు మంత్రి పదవి ఎట్లా వచ్చిందో అందరికి తెలుసున‌న్నారు. నీళ్లు, నిధులు నియామకాలు అనే ఎజెండాతో ఉద్యమంలో పాల్గొన్న పార్టీ టీఆఎస్ఆర్‌. ఉద్యమాన్ని ఉవ్వెతిన ఎగిరించిన వ్యక్తులు జయశంకర్, కోదండరాం, విద్యార్థులు, కళాకారులు మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు.

ఆర్టీసీ, సింగరేణి, విద్యార్థులు వ‌ల్లే ఉద్య‌మం ఉదృతంగా సాగింద‌న్నారు. నీళ్లు జగన్మోహన్ రెడ్డి తీసుకుపోతే, నియామకాలు పక్కదారి పట్టాయని విమ‌ర్శించారు. రాష్ట్రం ఏర్పడి ఆరేళ్ళు గడుస్తున్నా ఉద్యమంలో అమరులైన కుటుంబాలను ప్రభుత్వం గుర్తించలేదన్నారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వం అమరుల కుటుంబాలను ఘోరంగా అవమానించింద‌న్నారు. ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల పై కేసులు ఇంకా తొలగించలేదు కానీ.. కేసీఆర్ కుటుంబం పై ఉన్న కేసులను ప్రత్యేక టీమ్ లను పెట్టి కేసులు కొట్టేయించుకున్నార‌ని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్ళు గడుస్తున్నా ఉద్యమ కారుల పై కేసులు తొలగించకపోవడాన్ని చూస్తే ఉద్యమ కారులకు టీఆరెస్ ప్రభుత్వం ఎంత మర్యాద ఇస్తుందో అర్థం అవుతుందని తెలిపారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జయశంకర్ ని మర్చిపోయేలా చేశారు! కాళోజికి కనీసం కేసీఆర్ ఒక పూలమాల వెయ్యడం లేదు. బంగారు ముద్ద అయిన కోదండరాం ఇల్లును అద్ద రాత్రి పోలీసులు ముట్టడించారు. ప్రజా కవులు, కళాకారులు, ఉద్యమ నేతల పై సొంత రాష్ట్రంలో నిర్బంధం కొనసాగుతోంది.

విలువలతో కూడుకున్న తెలంగాణ రాష్ట్రం అవుతుంది అనుకుంటే.. నిర్బంధ తెలంగాణగా ప్రపంచానికి కనిస్తోంది. ఉచిత విద్య, దళిత గిరిజన రిజర్వేషన్లు, డబుల్ బెడ్ ఇండ్లు, మూడెకరాల భూమి, నీటి ప్రాజెక్టులు ఎక్కడ పోయాయి? అని ప్ర‌శ్నించారు. వ్యాపారం కోసం టీఆర్ఎస్‌ నేతలకు యూనివర్సిటీ లను కట్టబెట్టలేదా? కేజీ టు పీజీ ఉచిత విద్యా అంటే సొంత పార్టీ నేతలకు యూనివర్సిటీలు కట్టబెట్టడమా ఉద్యమంలో చెప్పిన నీళ్లు, నిధులు, నియామకాలు ఎన్నికల్లో చెప్పిన హామీలు ఎక్కడ పోయాయి? అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ మోసాల చిట్ట రాస్తే రామాయణం, చదువుతే భారతం అవుతుందన్నారు. కేసీఆర్ నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు మాత్రమే చెప్తాడు. కేసీఆర్ కొండ పోచమ్మ దగ్గర స్టార్ట్ చేస్తే ఐదు పంప్ హౌస్ లలో ఒక్కటే నడిచింది. కేసీఆర్ ఎత్తిపోసింది 50 టీఎంసీలు అయితే 50లక్షల పంట ఎట్లా పండిందో చెప్పాలన్నారు.

స్వేచ్ఛ కోసం ఉద్యమం చేస్తే.. సామాజిక తెలంగాణ కనిపించడం లేదు. 20 ఏళ్ల కింద రిటైర్మెంట్ అయిన కేసీఆర్ తన సామాజిక వ్యక్తులకు కీలక పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. త్వరలోనే కేసీఆర్ తన బంధువులకు ఇచ్చిన పోస్టుల లిస్ట్ విడుదల చేస్తాన‌న్నారు. ఎన్నో నష్టాలకు ఓర్చి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే.. ఇవ్వాళ ఎవరి పాలు అయిందో తెలంగాణ ప్రజలు ఆలోచన చెయ్యాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ కుటుంబం కోసం కాదు తెలంగాణ ప్రజల కోసమ‌న్నారు.

Next Story