ఈ లక్షణాలు ఉంటే కరోనా సోకినట్లే: బ్రిటన్ శాస్త్రవేత్తలు
By సుభాష్ Published on 3 Oct 2020 9:15 AM ISTప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. వైరస్ ఎటువైపు నుంచి సోకుతుందో తెలియని పరిస్థితి. అయితే వైరస్ లక్షణాలు ఎన్నో బయటకు వస్తున్నాయి. ఒక్కో సమయంలో ఒక్కో విధంగా రూపాంతరం చెంది వ్యాప్తి చెందుతుంది. దీనిపై కూడా శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా బ్రిటన్ శాస్త్రవేత్తలు ఈ వైరస్ మరికొన్ని లక్షణాలను బయటపెట్టారు. పూర్తిగా వాసనను కోల్పోవడం, రుచిని కోల్పోవడం కరోనా వైరస్ సోకిందని చెప్పడానికి అత్యంత విశ్వసనీయ లక్షణమని, ప్రపంచ వ్యాప్తంగా సెల్ఫ్ ఐసోలేషన్, పరీక్షలు, ఎవరెవరికి సోకిందో తెలుసుకోవడానికి ఈ లక్షణాలను ప్రధానంగా చేసుకుని గుర్తించాలని వారు పేర్కొన్నారు.
ఇటీవల బ్రిటన్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడైనట్లు చెప్పారు. ఈ పరిశోధనలో భాగంగా లండన్‌లోని ప్రైమరీ కేర్ సెంటర్స్‌లోని, 567 మంది ఆరోగ్య సమాచారాన్ని పరిశీలించి, వారిలో 78 శాతం మంది అకస్మాత్తుగా వాసన, రుచిని కోల్పోయినట్లు గుర్తించినట్లు చెప్పారు. వీరిలో 40 శాతం మందికి జ్వరం గానీ, దగ్గు, జలుబు కానీ లేవని అన్నారు. ఈ వైరస్‌పై మరిన్ని పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు.