భారత్‌లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం, రాష్ట్రాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. దీనిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ విధించారు. ఎవ్వరూ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్లొద్దని ఎక్కడి వారు అక్కడే ఉండాలని, ఇండ్లకే పరిమితం కావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలుసైతం లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. దీంతో వలస కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తినడానికి తిండికూడా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తమ స్వస్థలాలకు భారీగా తరలివెళ్తున్నారు. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారిని అడ్డుకుంటున్నాయి.

Also Read :ఎర్రగడ్డ మెంటల్‌ ఆస్పత్రికి మందు బాబులు..!

వలస కార్మికుల విషయంలో కేంద్రానికి మార్గదర్శకాలు జారీ చేయాలని న్యాయవాదులు అలోక్‌ శ్రీనివాస్తవ, భన్సల్‌ వేరువేరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఏ. బోబ్డే, జస్టిస్‌ ఎల్‌. నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రం తరపున సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాట్లాడుతూ.. కార్మికుల వలసని పూర్తిగా నిలిపివేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని ధర్మాసనం దృష్టికి తెచ్చాడు. దీంతో స్పందించిన సుప్రీంకోర్టు తమ స్వస్థలాలకు భారీగా వెళ్తున్న వలస కార్మికుల విషయంలో తీసుకుంటున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. మంగళవారానికి రిపోర్టు సమర్పించాలని సుప్రీంకోర్టు సూచించింది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్