పోలవరం ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారుపై వేటు
By Newsmeter.Network
ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనంగానే మారుతుంది. ప్రస్తుతం రాష్ట్రాలన్నీ కరోనా మహమ్మారిని అరికట్టేందుకు తమ సమయాన్ని కేటాయిస్తున్నాయి. కానీ ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఒకపక్క రాష్ట్రంలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కృషిచేస్తూనే.. రాష్ట్రానికి సంబంధించిన ఇతర విషయాలపైనా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇటీవలే శ్రీశైలం బ్యాంక్ వాటర్‌ను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటర్ ద్వారా ఆనకట్ట నిర్మించి పెద్దెత్తున తరలించుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం జీవో 203ను విడుదల చేసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలపోరాటానికి ఈ జీవో దారితీసింది. తాజాగా జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read :ఏపీలో కిలో చికెన్ ధర రూ.310..!
పోలవరం ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారు హెచ్‌కే సాహును విధుల నుండి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆధిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ కార్యాలయంలో ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారుగా సాహు పనిచేస్తున్నారు. 14ఏప్రిల్ 2018న ప్రభుత్వం కన్సల్టెంట్‌గా నియమించింది. ఆయన పనితీరు సంతృప్తిగా లేదని ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు సీఈ నివేదిక అందించారు. దీంతో కన్సల్టెంట్‌గా సాహును తొలగించే ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోలవరం పనులు కూడా ప్రస్తుతం నిలిచిపోయాయి. ఇదిలాఉంటే సాహు స్థానంలో ఎవరినైనా నియమిస్తారా..? లేదా సాంకేతిక సలహాదారు పోస్టును పూర్తిగా తొలగిస్తారా..? అన్నది ఆసక్తికరంగా మారింది. తన తొలగింపుపై హెచ్‌కే సాహు ఇంతవరకూ స్పందించలేదు.