రాశి ఫలాలు నవంబర్ 17 నుంచి 23 వరకు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Nov 2019 9:09 AM GMT
రాశి ఫలాలు నవంబర్ 17 నుంచి 23 వరకు

మేష రాశి: ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో కాస్త ప్రతికూలత ఉంటుంది. బుధ వీక్షణ, కుజ స్థితి అనుకూలించినా రవి నీచ స్థానాన్ని పొందటం అనేక ప్రతికూలతలు, అనారోగ్యానికి హేతువు. 7వ ఇంట్లో కుజుడు కోర్టు వ్యవహారాల్లో మేలు చేస్తాడు. అనారోగ్య సూచనలు ఉన్నాయి. భాగ్య శని తలుచుకుంటే చాలు దేన్నైనా సాధించేందుకు తోడ్పడతాడు. గురుని పంచమ దృష్టి వల్ల మంచి పనులకోసం ధనవ్యయం చేస్తారు. కుజ, శుక్రులు పరివర్తన ధనలాభాన్ని కలుగ చేస్తుంది. ఇంటాబయటా గౌరవాన్ని పొందుతారు. అశ్విని వారికి ప్రతికూలతలు ఎక్కువ. భరణి వారికి సాధన తార కావున అనుకూలతలు ఎక్కువ. కృత్తిక మొదటి పాదం వారికి పరిస్థితి అయోమయంగా ఉంటుంది.

పరిహారం: జీవిత భాగస్వామితో కలతలు పోవడానికి లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలు, విష్ణు సహస్రనామ స్తోత్రములు పారాయణ చేయండి. పెసలు దానం చేయడం లేదా నానబెట్టిన పెసలు బుధవారంనాడు ఆవుకు తినిపించండి.

వృషభ రాశి: ఈ రాశి వారికి ధన రాహువు, ఆరవ ఇంట్లో రవి కుజులు ఆర్థిక ఇబ్బందులకు కారణం అవుతారు. పంచమాధిపతి బుధుడు షష్ఠంలో వుండటం వలన బుద్ధి మందగిస్తుంది. సప్తమంలో శుక్రుడు విదేశీ వ్యవహారాలు చక్కబెట్టే వాడు. కానీ సప్తమంలో రవి కొంచెం ఆటంక పరచవచ్చు. అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉన్నది. ఆరోగ్యం, కుటుంబ వ్యవహారాలలో చిక్కులు కలుగుతాయి. 21వ తేదీన శుక్రుడు అష్టమంలో శత్రువు అయిన గురుని ఇంట్లో చేరటం మీరు ప్రత్యక్షంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాలసర్ప యోగం కూడా వర్తిస్తుంది. కృత్తిక వారికి అయోమయ స్థితి. రోహిణి వారికి మంచి ఫలితాలు కనిపిస్తాయి. మృగశిర వారికి జ్ఞాతి వైరం ఉంది.

పరిహారం: సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, కార్తీక సోమవారం నాడు రుద్రునకు అభిషేకం చేయించటం మంచిది ఫలితాలనిస్తాయి.

మిధున రాశి: ఈ రాశివారికి లగ్న రాహువు, సప్తమ శని కేతువుల వలన దాంపత్య సుఖం తక్కువ. ఎడబాటు కూడా కలుగవచ్చు. పంచమ స్థానంలో కుజుడు బుధుడు వల్ల బంధు విరోధం కలుగుతుంది. సప్తమ గురుడు సముడై లగ్నాన్ని చూడటం వల్ల మాత్రమే ఇబ్బందుల నుంచి బయట పడే మార్గం కనిపిస్తుంది. ఆలోచనలు సైతం మందకొడిగా సాగుతాయి. వాహనాన్ని నడిపే ముందు దైవనామస్మరణ, మంచి శకునాలను చూసి వెళ్ళండి. చెడు శకునాలు ఎదురైతే ఖచ్చితంగా ఆగడం మంచిది. రవి మిత్రుడైన కుజుని ఇంట్లో ఉండుట వ్యాపారాలలో నష్టమేమీ రానీయడు. ఉద్యోగంలో, చేస్తున్న పనిలో ఒడిదుడుకులు తప్పవు. లగ్న ద్వితీయ చతుర్దాలలో చంద్ర సంచారం కొంత అనుకూలిస్తుంది. 21వ తేదీ నుంచి కొద్దిగా మార్పులు కనిపిస్తాయి. మృగశిర వారికి జ్ఞాతి వైరం, ఆరుద్ర వారికి సంపత్ తార కావున లాభం కలుగుతుంది. పునర్వసు వారికి అనారోగ్యం, ప్రమాద సూచనలు ఉన్నాయి.

పరిహారం: ఎర్రని వస్త్రాలు ధరించండి. నానబెట్టిన గోధుమలు ఆవుకు తినిపించండి. సుబ్రహ్మణ్య స్తోత్రం చేయండి.

కర్కాటక రాశి: ఈ రాశివారికి చతుర్థము పంచమాలలో పాపులు ఉండుట వలన కుటుంబ సభ్యులతో వైరము. పిల్లలు స్వతంత్ర భావాలను వ్యక్తం చేయడం జరుగుతుంది. మానసిక ఆందోళన ఉంటుంది. వాహన యోగము గానీ ఆకస్మిక ధనలాభము కానీ కలదు. బుధవారం లోగా ఏదో ఒక లాభాన్ని పొందగలరు. అనుకున్న ప్రయాణాలు వాయిదా పడతాయి. సప్తమ అష్టమాధిపతి శని దృష్టి శారీరిక అనారోగ్యాన్ని సూచిస్తుంది. గురు, శుక్ర, శని గ్రహాల కలయిక అంతలోనే నిరాశ, అంతలోనే ధైర్యాన్ని కలిగిస్తాయి. ఉద్వేగం ఉంటుంది. ప్రతి పనిని బాగా ఆలోచిస్తారు కానీ ఆ పనిని వాయిదా వేస్తారు. ఇది మీకు ఇబ్బంది కలిగిస్తుంది. వ్యయ రాహువు కూడా ఆందోళనలో ఒక భాగమై వెనుకడుగు వేయిస్తాడు. పునర్వసు వారికి అనారోగ్యం, ప్రమాదం సూచనలున్నాయి. పుష్యమి వారికి మిత్రుల సహకారం లభిస్తుంది. ఆశ్లేష వారికి బాకీలు వసూలవుతాయి.

పరిహారం: ప్రతిరోజు శివుడి దర్శనం చేయండి. మన్యు సూక్త పారాయణ చేయించండి. చండీ అర్చన, హోమములు విశేష ఫలితాలు ఇస్తాయి.

సింహరాశి: ఈ రాశి వారికి పంచమంలో గురుడు నవమ దృష్టితో ఉన్నందువలన వాక్ చాతుర్యంతో పనులు గడిచిపోతాయి. రవి మిత్రుని ఇంట ఉండుట, కుజ శుక్రుల పరివర్తన వీరికి సమస్యలు పరిష్కరిస్తాయి. పిల్లలతో చికాకులు ఏర్పడతాయి. కేంద్ర కోణ గ్రహాల అనుకూలత ఉన్నా దైవదర్శనాలు మీకు మేలు చేస్తాయి. దైవాన్ని, గురువుని విడువకండి. పెద్దలతో వివాదాలు రాకుండా చూసుకోండి. అధికారులతో విరోధం మీ వృత్తి ఉద్యోగాలకు ఇబ్బంది కలిగించవచ్చు. మీకు ఎప్పుడూ కుటుంబపరమైన వ్యయం తప్పదు. అమ్మకాలు కొనుగోళ్లకు మంచి రోజులు కాదు. ఆత్మ బుద్ది సుఖం చైవ. స్త్రీల సలహాలు ఇప్పుడు పాటించడం సరికాదు. ఏ విషయంలోనూ న్యాయం చెప్పే బాధ్యత మీరు తీసుకోవద్దు. మధ్యలో ఇరుక్కొని చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. మఖ వారికి నైధిన తార, నక్షత్ర అధిపతి శని అవటంవల్ల వ్యతిరేకత ఎక్కువ. పుబ్బ వారికి కొంచెం బాగుంటుంది. మొత్తం మీద ఈ రాశివారికి అంత బాగా లేదనే చెప్పుకోవచ్చు.

పరిహారం: శివుడికి సోమవారం అభిషేకం చేయించండి. ఇంట్లోనే ఏదో ఒక పూజ చేయండి. సోమవారం ఉపవాసం సత్ఫలితాలనిస్తుంది.

కన్య రాశి: ఈ రాశివారికి లగ్నాధిపతి ద్వితీయము నందు స్థిర ఆదాయాన్ని ఇవ్వబోతున్నాడు. అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది. మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోండి. దీర్ఘ రోగం తో ఉన్న వారికి ఆరోగ్యం కొద్దికొద్దిగా కుదుటపడుతుంది. గురు శుక్రుల కలయిక శని ప్రభావాన్ని కొంచెం తగ్గిస్తుంది. 21వ తేదీలోగా ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. మీ పనేదో మీదిగా ప్రవర్తించండి. ఇతరుల విషయాల వలన మీకు నష్టమే తప్ప లాభం ఉండదు. లగ్నాధిపతి ధన స్థానము కనుక ఆకస్మిక ధన లాభం కలగ వచ్చు. తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఏదన్నా మీకు అనుకోని బాధ్యతలు నెత్తిన పడతాయి. ఉత్తర వారి కన్నా హస్త నక్షత్రం వారికి బావుంది. చిత్తా నక్షత్రం వారు చంచలత్వం తోనే ఉంటారు. మొత్తం మీద ఈ వారం గత వారం కన్నా మెరుగ్గా ఉంటుంది.

పరిహారం: రుద్రాభిషేకం చేయించండి. సూర్య నమస్కారాలు యోగ సాధన మీకు మనశ్శాంతి నిస్తాయి.

తులారాశి: ఈ రాశి వారికి లగ్నాధిపతి ధన లగ్న స్థితి, కుజ శుక్రులు పరివర్తన మేలు చేయనున్నాయి. రవి ద్వితీయ మందు ధన వ్యయం కలిగిస్తాడు. అది కూడా ఆరోగ్య విషయంలోనే. అయితే ధన కారకుడు ధన స్థానము కనుక అవసరానికి తగిన డబ్బు సమకూరుతుంది. వృత్తిరీత్యా కుటుంబ రీత్యా ఇబ్బందులున్నా గురుని కృపతో అవి తొలగిపోతాయి. సప్తమాధిపతి ధనాధిపతి కుజుడు లగ్నంలో ఉండటం వల్ల కూడా ఈ వారంలో మంచి ఫలితాలే చూస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో కూడా కొంచెం ఉన్నతి ఉంటుంది. చతుర్ధ పంచమాధిపత్యం గల శని ప్రభావం పిల్లలు, తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గౌరవ మర్యాదలు ఇంతకు ముందుకన్నా పెరుగుతాయి. స్వాతి నక్షత్ర జాతకులకు మేలు ఫలితములు ఉన్నవి. చిత్త వారికి సామాన్యము. విశాఖ వారికి ధన లాభం సూచిస్తోంది.

పరిహారం: బొబ్బర్లు అంటే అలసందలు దానం చేయండి. తెల్లని వస్త్రధారణ తెల్లని వస్త్రదానము మంచి ఫలితాలనిస్తాయి. ఆంజనేయ స్వామి పూజ ప్రయోజనాన్ని కలిగిస్తుంది.

వృశ్చిక రాశి: ఈ రాశివారికి ద్వితీయ గురుడు, సముడైన గురుని ఇంట్లో శని సంచారము మంచి ఫలితాలనిస్తాయి. లగ్నాధిపతి వ్యయ స్థితి ఖర్చు, శ్రమలను సూచించగా రవి, శుక్రుల కలయిక అనారోగ్య సూచన. సంపాదన పెరిగినా అంతకంతా ఖర్చు తప్పదు. ద్వితీయ శని ప్రభావం తగ్గింది. గురుని స్థానబలం మీకు లాభం కలిగిస్తుంది. క్రమక్రమంగా మంచి రోజుల్లో కి మీరు అడుగు పెడుతున్నారు. అయితే ఏదో చిన్న ఆందోళన మాత్రం ఉంటుంది. 21వ తేదీ తర్వాత శుక్రుడు తన స్థానం లోకి చేరడం వల్ల మంచి జరుగుతుంది. మొత్తం మీద మీకు కష్టాలు గట్టెక్కబోతున్నాయి. స్థిర, చర ఆస్తులను సంపాదించే మార్గాలు ఉన్నాయి. దైవచింతన ఇంట్లో అందరిలోనూ పెరుగుతుంది. అష్టమ రాహు బద్ధకం కలిగిస్తాడు. విశాఖ వారికి ధన లాభం. అనురాధ, జ్యేష్ఠ వారికి మంచి జరిగే అవకాశాలున్నాయి.

పరిహారం: అయ్యప్ప మాల దీక్ష, నల్లని వస్త్రధారణ ఫలితాలు ఇస్తుంది. బుధవారం నాడు నానపెట్టిన పెసలు బెల్లంతో కలిపి ఆవులకి తినిపించడం శ్రేయస్కరం.

ధనరాశి: ఈ రాశివారికి దైవ బలం పెరిగింది. గురువు అనుగ్రహం కూడా కలిగింది. రాబోతున్న శుక్రుడు కూడా సమని ఇంట్లో ఉంటాడు కనుక మీ జాతకంలో మంచి రోజులు ఊపందుకున్నాయి. ఏలినాటి శని తను స్థానంలో ఉన్న దైవచింతన మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మూలా నక్షత్రం వారు శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. షుగర్ బీపీ ఒంట్లోకి తెచ్చి పెట్టుకుంటారు. వ్యాపార వ్యవహారాలను సరైన వాళ్లకు అప్పగించండి. తోటి ఉద్యోగులతో శాంతంగా ప్రవర్తించండి. తల్లి పిల్లల ఆరోగ్యాలు అంతంత మాత్రం. సమయానికి ధనం అందినా వేరొక మార్గంలో ఖర్చయిపోతుంది. మూలా నక్షత్రం వారికి నైధన తారతో ప్రారంభం కాబట్టి అనుకూలత లేదు. పూర్వాషాడ నక్షత్రం వారికి కార్యజయం. ఉత్తరాషాఢ 1వ పాదం వారికి ప్రతికూలంగా ఉంది. మొత్తంమీద ఊహల్లో విహరించకండి ఆచితూచి అడుగు వేయండి.

పరిహారం: దత్తాత్రేయ స్తోత్రం, గురువార నియమాలు పాటించండి. శనికి స్తోత్రం గానీ తైలాభిషేకం గాని సత్ఫలితాలనిస్తుంది.

మకర రాశి: ఈ రాశివారికి కొంచెం గడ్డు కాలమనే చెప్పాలి. వేళకు తిండి నిద్ర ఉండదు ఆందోళనలు ఎక్కువ. వారం ప్రారంభంలో ఏవైనా స్థిరాస్తి కొనుగోలు పూర్తి చేసేయండి. దైవం మీద నమ్మకం ఉన్నా లేకపోయినా సరే పూజలు అభిషేకాలు చేయించండి. ఏల్నాటి శని మూడవసారి ఎలాంటి అయితే మాత్రం ఆరోగ్య విషయంలో మీరు తప్పక జాగ్రత్త వహించాలి.చిన్నచిన్న అనారోగ్యాలనుకున్నవే పెద్దగా ఇబ్బంది పెట్టే రోజులు. తల్లి, పిల్లలు, జీవిత భాగస్వాముల అనారోగ్యాలు మీలో ఉత్సాహాన్ని నీరుగార్చేస్తాయి. నిగ్రహం పాటించండి వాదనలకు దిగకండి. ఈ గ్రహం మీకు అనుకూలంగా ఉంది అని కచ్చితంగా చెప్పడానికి లేదు. ఆరవ ఇంట ఉన్న రాహువు మాత్రమే మీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఉత్తరాషాడ వారికి ప్రతికూలత ఎక్కువ. శ్రవణం వారికి క్షేమ తార కావున 75శాతం బాగుంటుంది. ధనిష్ట వారికి మాట చెల్లుబాటు అవుతుంది.

పరిహారం: కార్తీక సోమవారం ఉపవాసం అభిషేకం మంచిది. శనికి తైలాభిషేకం అవసరం.

కుంభరాశి: ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉన్నట్టుగా భావించవచ్చు. లగ్నాధిపతి లాభస్థితి, గురుడు లాభంలో స్వక్షేత్రంలో ఉండటంవల్ల శుభఫలితాలు ఎక్కువగా ఉంటాయి. పట్టిందల్లా బంగారం అనిపించవచ్చు. కోర్టు వ్యవహారాలు ఫలిస్తాయి. రాజకీయ పలుకుబడి పెరుగుతుంది. మధ్యవర్తిత్వం పనిచేస్తుంది. బంగారం లాంటి భవిష్యత్తు కళ్ళెదురుగా కనిపిస్తుంది. మీ ప్రమేయం లేకుండానే కొన్ని హంగులు ఆర్భాటాలు జరిగిపోతాయి. విందులు వినోదాలలో పాల్గొంటారు. ధన వ్యయం తప్పదు. డబ్బు పోయినా ఆనందంగా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, బంధువులతో గడుపుతారు. 21వ తేదీ నుంచి స్థిర, చర ఆస్తులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం కాపాడుకోండి ధనిష్ట వారికి మాట చెల్లుబాటు తక్కువ. శతభిషం వారికి ఆకస్మిక ధన లాభం లేదా రాదనుకున్న బాకీలు వసూలవుతాయి. పూర్వాభాద్ర వారికి కొద్దిపాటి ప్రతికూలత ఉంది.

పరిహారం: గణపతిని అర్చించండి. గణేషోపనిషత్ పారాయణ చేయండి. మోదకాలతో హోమం జరిపించండి.

మీన రాశి: ఈ రాశివారికి లగ్నాధిపతి గురుడు రాజ్యంలో ఉండుట స్థిరాస్తిని కొంటారు. తల్లి ఆస్తి కూడా కలిసి రావచ్చు. మంచి పనులు చేస్తారు, చేయిస్తారు. పరీక్షలోనూ, ఉద్యోగంలోనూ ఉన్నత స్థాయి పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ కింద పని చేయడానికి సైతం చాలామంది ఉత్సాహంగా ఉన్నారు. ఏదైనా కంపెనీలో భాగస్వామ్యం పొందడానికి అనుకూలము.మీ సహాయం పొందిన వారు మీకు ఆర్థిక లాభాన్ని చూపించే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలకు అనుకూలము. వివాహం కావలసిన వారు 22వ తేదీ నుంచి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు పొందగలరు. ధన దాహం పెంచుకోవద్దు. అధికార దుర్వినియోగం జరిగితే జాతకం మారిపోతుంది. తస్మాత్ జాగ్రత్త. గురు శుక్ర కేతువుల కలయిక దానధర్మాలు చేస్తారని, దైవభక్తి కలిగి ఉంటారని సూచిస్తుంది. పూర్వాభాద్ర వారికి అనుకూలత తక్కువ. ఉత్తరాభాద్ర, రేవతి వారికి చాలా బాగుంది.

పరిహారం: శనివారం నియమాలు, విష్ణుసహస్రనామ పారాయణం ఫలితాలనిస్తాయి.

Next Story