దానికి గంగూలీనే కార‌ణం : పాక్ మాజీ క్రికెట‌ర్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Jan 2020 12:50 PM IST
దానికి గంగూలీనే కార‌ణం : పాక్ మాజీ క్రికెట‌ర్

పాకిస్థాన్ క్రికెట్‌ జట్టు ప్ర‌స్తుతం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల నుండి బయటపడాలంటే బీసీసీఐ ఒక్క‌టే దిక్క‌ని ఆ జ‌ట్టు మాజీ క్రికెటర్‌ రషీద్‌ లతీఫ్ అన్నారు. ఈ విష‌య‌మై ప్ర‌స్తుత బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న‌ సౌరవ్‌ గంగూలీ చొరవ తీసుకోవాలని కోరాడు. భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక సిరీస్‌తో మా దేశంలో మళ్లీ క్రికెట్‌కు మంచి రోజులు వస్తాయని.. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని గంగూలీని విన్న‌వించాడు.

అలాగే.. 2004లో పాక్‌లో భార‌త‌జ‌ట్టు పర్యటించడానికి అప్పుడు కెప్టెన్ గా ఉన్న‌ గంగూలీయే కారణమన్నాడు. అప్పుడు పాక్‌లో పర్యటించడానికి బీసీసీఐ అయిష్టంతో ఉన్నా గంగూలీ బోర్డుకు, ఆట‌గాళ్ల‌కు న‌చ్చ‌జెప్పిన‌ కారణంగానే టీమిండియా.. పాక్‌లో పర్యటించిందన్నాడు. సుదీర్ఘకాలం తర్వాత జరిగిన ఆ టూర్‌లో భారత్‌ మరపురాని విజయాలు అందుకుందని ల‌తీఫ్ అన్నాడు. ఇప్పుడు కూడా పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ విషయంలో గంగూలీ శ్రద్ధ చూపాలన్నాడు. ఇరుజ‌ట్ల మ‌ధ్య‌ క్రికెట్‌ మ్యాచ్‌ల పునరుద్ధరణకు ఓ క్రికెటర్‌గా, బీసీసీఐ చీఫ్‌గా.. పాక్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్‌ ఎహ్‌సాన్‌ మణికి గంగూలీ సాయం చేస్తాడని తాను ఆశిస్తున్నానని తెలిపాడు.

టీమిండియా-పాక్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్‌లు జరగనంతవరకు రెండు దేశాల మధ్య పరిస్థితులు మెరుగ‌వ‌వ‌ని తెలిపాడు. ఇదిలావుంటే.. 2004లో పాకిస్తాన్‌లో పర్యటించిన భారత జట్టు.. వన్డే సిరీస్‌తో పాటు టెస్టు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. ఐదు వన్డేల సిరీస్‌ను 3-2 తేడాతో గెలిచిన టీమిండియా.. మూడు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది.

Next Story