రాశి ఫలాలు అక్టోబరు 27వ తేదీ నుంచి నవంబర్ 2 వరకు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Oct 2019 1:12 PM ISTమేష రాశి: ఈ రాశి వారికి చంద్రుడు తులా రాశిలో వుండుట సప్తమంలో, నీచలో రవి ఉండుట వలన ఆత్మన్యూనత, మానసిక దుర్బలత్వం కలిగియుందురు. అనారోగ్య సూచన కూడా కలదు. తల్లిదండ్రుల ఆరోగ్యం కాపాడుకోవాలి. బంధువులతో విరోధం తప్పదు. ఆందోళన ఎక్కువగా ఉండును. అష్టమ గురుడు గనుక జ్ఞాపకశక్తి తగ్గును.భాగ్య శని అపకీర్తి కారకుడు. ఈ రాశివారు సాధ్యమైనంతవరకు మౌనం వహించడం మంచిది. అశ్విని నక్షత్ర జాతకులకు ప్రత్యక్తార తో ప్రారంభం కావున కాస్త ఇబ్బంది ఉండును. భరణి నక్షత్ర జాతకులకు క్షేమ తార తో ప్రారంభమైనప్పటికీ అవయోగ సూచన కలదు. కృత్తికా నక్షత్ర జాతకులకు విపత్తార తో ప్రారంభం కావున ఆపద సూచనలు ఉన్నవి.
పరిహారం: ప్రతిరోజు సూర్యోదయం సరికి లేచి రవికి నమస్కారము చేయుట, చంద్రుడికి జపం సత్ఫలితాలను ఇస్తుంది. రవి, గురువారాలలో ఆహార నియమాలు పాటించిన శుభ ఫలితాలు పొందవచ్చు.
వృషభ రాశి: ఈ రాశి వారికి సప్తమం లో గురు శుక్ర చంద్రులతో కలయిక మంచి ఆలోచనలు, ఆత్మస్థయిర్యాన్ని, మనోధైర్యాన్ని ఇస్తాయి. అష్టమంలో శని, కేతు ద్వితీయము నందు రాహువు వలన మాట జారి పోవటంతో కుటుంబ కలహాలు ఉంటాయి. రాజ్యాధిపతి శుక్రుడు సప్తమంలో ఉండటం వలన ఉత్సాహంగాను, ప్రశాంతంగాను ఉంటారు. సంతాన స్థానములో కుజుడు ఉన్నా గురు, శుక్ర దృష్టి వలన పిల్లలు మీ మాట వింటారు. కొంచెం అనుకూలిస్తారు. భార్య పిల్లలతో కలిసి ఉండటం, ప్రయాణించటం, వినోదం, విహారానికి అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. కృత్తిక వారికి ఈ వారం విపత్తార తో ప్రారంభం. అనుకూలంగా లేని రోజులు. రోహిణి వారికి తారాబలం బాగుంది, మిశ్రమ ఫలితాలనిస్తుంది. మృగశిర వారికి జన్మతార అనారోగ్య సూచన.
పరిహారం: ఆంజనేయస్వామికి వడమాల సమర్పణ, మంగళవారం నియమాలు పాటించడం మంచిది. పూజించిన నిమ్మకాయలను మీ దగ్గర ఉంచుకోండి.
మిధున రాశి: ఈ రాశి వారికి లగ్నాధిపతి బుధుడు పంచమంలో ఉన్నాడు. సంతానం వల్ల మాత్రమే ఆనందం కలుగుతుంది. రాహువు సప్తమము నందు శని, కేతువులు అపమృత్యు దోషాన్ని కలిగి ఉండగా రవి చంద్రుడు కూడా ప్రతికూల స్థితి వహిస్తున్నారు. ధైర్యాన్ని వహించడం చాలా అవసరం. ఈ వారంలో చంద్రుడు నీచ స్థిత రవి తోనూ, షష్ఠ స్థిత గురు, శుక్రు లతోనూ సప్తమంలో శనితోనూ కలయిక వలన అన్ని విధాలా ప్రతికూలతే కనిపిస్తుంది. ప్రతి పనిని ధైర్యం చాలక వాయిదా వేసుకుంటూ పోతారు. ముందడుగు వేస్తే ఏమవుతుందో అనే భయం ఉంటుంది. గురుశుశ్రూష, సంగీత సాహిత్యాలు మీకు ప్రశాంతతను ఇస్తాయి. మృగశిర వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆరుద్ర వారికి ఏదో విధంగా ధనలాభం ఉంటుంది. పునర్వసు వారికి స్నేహితులే రక్ష.
పరిహారం: విష్ణు సహస్ర నామ పారాయణ అద్భుత ఫలితాలను ఇస్తుంది. పెసలు దానం ఇవ్వడం లేదా నానవేసిన పెసలు, బెల్లం కలిపి ఆవుకు తినిపించడం మంచిది.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఐదవ ఇంట గురుడు వాహన యోగాన్ని శుక్రుడు విలాస జీవితాన్ని ఇస్తున్నారు. గురుశుక్రులు ఇద్దరు విశేషంగా యోగిస్తారు. వివాహ ప్రయత్నాలు కొనసాగుతాయి. పుత్ర సంతానం ఉంది. శ్రమను తెలివిని గుర్తిస్తారు మీకు ప్రాధాన్యతనిస్తారు. భాగ్య క్షేత్రాన్ని గురుడు చూస్తున్నాడు కాబట్టి ధనాదాయం బాగుంటుంది. శత్రువులు మళ్లీ మిత్రులు అవుతారు. ఆరోగ్యం పెరుగుతుంది. గురు శుక్రుల కలయిక వలన కళలో నైపుణ్యం బయటపడుతుంది. రాజ్యాధిపతి రవి నీచలో ఉండటం వలన అకాల భోజనం, కళ్ళకు ఇబ్బంది, జ్వరాలకు అవకాశం ఉంది. తల్లిదండ్రుల సేవ పుణ్య క్షేత్ర దర్శనం కన్నా గొప్ప ఫలితాలను ఇస్తుంది. చతుర్ధ పంచమ చంద్రుని వల్ల మనస్సు కూడా ప్రేమాభిమానాలు కోరుకుంటుంది, పొందుతుంది. పునర్వసు, పుష్యమిల కన్నా ఆశ్లేష వారికి మంచి సంకల్పాలు కలుగుతాయి, సిద్ధిస్తాయి.
పరిహారం: పాలు, పెరుగు దానం చేయండి. మహాలక్ష్మికి లక్ష్మి, శుక్రవారాల్లో అభిషేకాలు చేయించండి. గోవును చూసిన వెంటనే ముట్టుకోవడం లేదా నమస్కరించడం చేయండి. దీపావళి నాడు లక్ష్మీపూజ జరిపించండి.
సింహరాశి: ఈ రాశి వారికి వారం మధ్యలో చాలా పనులు నెరవేరుతాయి. చతుర్థంలో గురు, శుక్ర, చంద్రుల కలయిక వలన అనుకున్న ప్రతి పని నెరవేరడానికి మార్గాలు సుగమం అవుతాయి. మాతృ, పితృ సౌఖ్యం, గృహ వాహన లాభాలు సిద్ధిస్తాయి. మనసు మాత్రం కుదురుగా ఉండదు. ఆలోచనలు ఎక్కువ. ఏదో ఒక పనిలో పడితే ఇబ్బంది ఉండదు. పని లేకపోతే ఇబ్బంది పడతారు. సంతానం వల్ల ఇబ్బంది ఉన్నా దాటేస్తారు.చిన్న పనైనా పెద్ద పనైనా విడిచిపెట్టకుండా ముందుకు సాగుతారు.చంద్రుడు నీచను పొందినా సంకల్పం లో దృఢత్వం ఉంటే అదే సాధ్యపడుతుంది. మఖ వారికి ప్రత్యక్ తారతో వారం ప్రారంభం కావున కొంచెం అనుకూలత తక్కువ. పుబ్బ వారికి విశేష శుభఫలితాలు కారణం క్షేమ తార తో ప్రారంభం కావడమే. ఉత్తర వారికి మిశ్రమ ఫలితం ఈ రాశివారు ధైర్యం వహిస్తే అన్ని పనులు ఎక్కువగా నెరవేరుతాయి.
పరిహారం: ప్రతిరోజు గణపతిని, శివుని దర్శించండి దీపావళి నాడు అభిషేకం జరిపించండి.
కన్యారాశి: ఈ రాశి వారికి ఈ వారంలో ధనవ్యయ అధిపతులతో బుధ, రవి కలయిక వలన వీటికి శని సంయోగదృష్టి ల వలన, రాశిలో కుజ స్థితి వలన అనుకున్న కార్యాల్లో చికాకులు ఎదురవుతాయి. రాశిలో కుజ స్థితి కడుపునొప్పి, రక్తసంబంధమైన ఇబ్బందులను కలిగి చేయవచ్చు. నాలుగవ ఇంట శని కూడా ప్రమాదాన్ని సూచిస్తున్నాడు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. బుధుడు స్వస్థానంలో అధిపతి కనుక వ్యాపారపరంగా వాక్చాతుర్యంతో నడిపించు కోవాలి. మీ ఇంట్లో విశ్వాసం వల్ల ఎదుటి వారు ఆప్తులు అవుతారు. కాబట్టి మంచి మాటలతో పని జరిపించుకోవాలి. ఆపత్కాలంలో తోబుట్టువుల సహాయ సహకారాలు అందుతాయి.ఉత్తర వారికి విపత్తార వలన మిశ్రమ ఫలితము కాగా, హస్త వారికి ఆర్థిక ఆలంబన లభిస్తుంది. ఏదో ఒక రూపంలో ధనం అందుతుంది. చిత్తా నక్షత్రం వారికి మాత్రం యోగం తక్కువ.
పరిహారం: కుజు దోష నివారణకు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లేదా ఆంజనేయ స్వామికి పూజలు చేయించండి. ఆంజనేయ దండకం మంచి ఫలితాన్ని ఇస్తుంది.శని దోష నివారణకు తైల అభిషేకం గాని నువ్వుల నూనె దీపం గానీ మంచిది.
తులారాశి: ఈ రాశి వారికి శుక్రుడు ద్వితీయ, తృతీయ స్థానాల్లో సంచారం వల్ల ధన లాభం ఉంటుంది. సప్తమ అధిపతి రవి నీచలో ఉండటం వల్ల తనను తాను తక్కువ గా చేసుకోవడం, కంటి సంబంధమైన అనారోగ్యం, తలనొప్పి మొదలవుతాయి పితృ వంశం వారికి అనారోగ్య సూచన. ధనస్థానము నందు గురుడు సమయానికి తగిన డబ్బు చేతికి అందించడానికి తోడ్పడతాడు. చంద్రుడు ద్వితీయంలో కి చేరినప్పుడు మనో దర్భలత ఏర్పడుతుంది. శని కేతువుల కలయిక వల్ల అన్నదమ్ముల, అక్కా చెల్లెళ్లతో అన్యోన్యత పెరిగి ధైర్యం కలుగుతుంది. సాహసాన్ని ప్రదర్శిస్తారు. ధనస్థానము నందు కుజుడు వ్యయం లో ఉండటం వల్ల అనవసర శ్రమ, వ్యయం తప్పదు. మొత్తం మీద ఈ రాశి వారికి మధ్యమ స్థాయి ఫలితాలు కలుగు తాయి. చిత్తా నక్షత్రం వారి జన్మ చంద్రుడు అతి సామాన్య ఫలితాలను, వారం మధ్యలో మంచి ఫలితాలను ఇస్తాడు. స్వాతి వారికి చంద్రుడు ఆవేదన కలిగిస్తాడు. విశాఖ వారికి చంద్రుడు యోగించే అవకాశం ఉంది.
పరిహారం: గణపతి హోమం, దీపావళినాడు కుంకుమార్చన, గోసేవ విశేష ఫలితాలనిస్తుంది ఇందులో ఏదో ఒకటి చేసినా చాలా మంచిది.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి వ్యయమందు రవి, బుధ, చంద్రుల కలయిక ఆందోళన, అనారోగ్య సూచన. గురుడు కూడా అనారోగ్యాన్ని సూచిస్తున్నాడు. వాక్ స్థానము లో శని, కేతువు, చంద్రుడు సంయోగం మానసిక ఆందోళనలు, ధన లేమి, కుటుంబ పీడ, నేత్ర సంబంధ సమస్యలు తప్పవు. లగ్నాధిపతి శుక్రుడు ధన స్థానం వల్ల ఏదో ఒక విధముగా ధనం చేతికి అందినా చంద్రుని కలయికతో అనవసర వ్యయం అవుతుంది. ఇంట గెలవలేరు. రచ్చ కూడా అనుమానమే. దూరప్రయాణం సూచనలు కలవు. అష్టమ రాహువు తండ్రి తరపు వారికి అనారోగ్య సూచన. విశాఖ 4వ పాదం వారికి మిత్ర తారతో చంద్రబలం కానీ చంద్రుని నీచ స్థితి వలన అనారోగ్యం, ఆర్థిక ఇబ్బంది. అనురాధ వారికి అవయోగాలే ఎక్కువగా సూచిస్తున్నాయి. జ్యేష్ఠ వారికి స్వస్థానంలో, నీచ స్థానంలో చంద్ర సంచార అన్ని బలాలను తగ్గిస్తుంది. అనుకున్న స్థాయిలో ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఏర్పడవు.
పరిహారం: ఈ రాశివారు దీపావళి నాడు, ఆ మరునాడు రుద్రాభిషేకం, శివదర్శనం సత్ఫలితాలను ఇస్తాయి. ఏలినాటి శని దోషం పోవడానికి నువ్వుల నూనె దీపం వెలిగించండి.
ధను రాశి: ఈ రాశి వారికి సప్తమంలో రాహువు, వ్యయ చంద్రుడు నీచ స్థాన ప్రయాణ చంద్రుడి వలన అవయోగాలు ఎక్కువ. లగ్నంలో శని కేతువులు లో మార్పు లేదు. ఇంట్లో వివాదాలు, వృత్తి వ్యాపారములలో వివాదాలు తప్పవు. చివరికి స్నేహితులు కూడా వీరినే తప్పు పడతారు.. దీనికి కారణం ఒక్క ఏలినాటి శని మాత్రమే కాదు లగ్నాధిపతి గురుడు వ్యయమందు ఉండుట కూడా. మీ మాట ఎదుటివారిని ఇబ్బంది పెడుతుంది. వారం మధ్యలో అన్ని రకాలుగా నీరసించి అశక్తత, దుర్బలత్వం పెరుగుతాయి. ఏ ప్రయత్నమూ ఒక కొలిక్కి రాదు. ఎంతో కష్టపడి సాధించిన గౌరవ మర్యాదలకు భంగం తప్పదు. రవి బుధులు సములై ఉన్నా రవి కి శత్రు స్థానం, నీచ స్థానం అవటం వల్ల అవ యోగాలు ఎక్కువ. మూలా నక్షత్ర జాతకులకు ప్రత్యక్తార తోనూ, ఉత్తరాషాడ నక్షత్రం వారికి విపత్తార తోను వార ప్రారంభం కనుక యోగించే అవకాశం తక్కువ. పూర్వాషాడ వారికి క్షేమ తారతో వారం ప్రారంభమైనప్పటికీ యోగములు తక్కువగానే ఉండును.
పరిహారం: అన్ని రకముల అవయోగాలు పోగొట్టుకోవటానికి శివునకు రుద్రాభిషేకం, శివ స్తోత్ర పఠనము, నువ్వులతో తర్పణ, నువ్వుల నూనెతో దీపం దానము ప్రశస్తము.
మకర రాశి: ఈ రాశి వారికి శని వ్యయ స్థితి అనారోగ్య సూచన. లాభ గురుడు, లాభ శుక్రుడు యోగిస్తారు. వ్యయ అధిపతి గురుడు మానసిక ఆందోళన కారకత్వం వహిస్తాడు. రాహువు శతృ విజయాన్ని కార్య జయాన్ని సూచిస్తుంది. తను ధన స్థానాధిపతి శని వ్యయం లో ఉన్న కారణంగా మాట నైపుణ్యం కూడా పోతుంది. పని అయిన తర్వాత పశ్చాత్తాపపడే స్వభావం ఉంటుంది. దంపతుల మధ్య తెలియని అగాధం ఏర్పడుతుంది. ఎవరికీ చెప్పుకోలేక సర్దుకుపోలేక దూరం పెరుగుతుంది. రవికి అష్టమాధిపత్యం ఉన్నా నీచ స్థాన స్థితిని అనారోగ్య హేతువు. సప్తమాధిపతి చంద్రుడు భాగ్య రాజ్య సంచారంతో 31వ తేదీ వరకు బావుంటుంది. అక్కడినుంచి మానసిక ఆందోళన పెరుగుతుంది, మనశ్శాంతి తగ్గుతుంది. కుజుడు భాగ్య కోణాల్లో లభిస్తాడు. శ్రవణా నక్షత్ర జాతకులకు మాట చెల్లుబాటు అవుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి ఉత్తరాషాడ విపత్తార తో వారం ప్రారంభం కావున అవయోగం ఎక్కువ. ధనిష్ట 1, 2 పాదాలు వారికి శుభఫలితాలుంటాయి. మొత్తంమ్మీద ఈ రాశివారికి ఈ వారాంతంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి.
పరిహారం: దీపావళి నాడు, మంగళవారం నాడు లక్ష్మీపూజ శుభఫలితాలనిస్తుంది. ఆందోళన తగ్గాలంటే తెల్లని వస్త్రాలు ధరించండి లేదా బియ్యం దానం చేయండి. గోవుకి అటుకులు బెల్లం తినిపించండి.
కుంభ రాశి: ఈ రాశి వారికి ఈ వారం వాక్కు స్థానాధిపతి రాజ్యంలో ఉండటం శుభసూచకం. రాజ్యాధిపతి శని లాభంలో ఉండటం విశేషం యోగం. చేస్తున్న వృత్తి ఉద్యోగాలను గురుడు కాపాడతాడు. మంచిగా మాట్లాడి పనులు జరిపించు కుంటారు. ఉద్యోగ అవకాశం, ఉద్యోగంలో ఉన్నతి, పుత్రసంతానం అవకాశాలున్నాయి. వివాహ ప్రయత్నాలకు మంచిరోజులు వచ్చాయి. మాటలను పదిలంగా వాడండి. ధనిష్ఠ వారి కన్నా శతబిషం వారు ఎక్కువ ఫలితాలు పొందుతారు. పూర్వాభాద్ర వారికి మాత్రం హెచ్చరికలు తప్పవు. మొత్తం మీద ఈ రాశివారు ఆరోగ్య వాక్కు స్థానాలను భద్రపరిస్తే అనుకూలతలు ఎక్కువై యోగించే సమయం కూడా ఉంటుంది.
పరిష్కారం: ప్రతి రోజు గణపతి దర్శించండి. గణపతి స్తోత్రం పఠనం చెయ్యండి. వీలైతే గణపతి ఉపనిషత్తు పారాయణ చెయ్యండి లేదా చేయించండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మీన రాశి: ఈ రాశి వారికి ఈ వారంలో శుభఫలితాలు ఎక్కువగా ఉంటాయి.గురు, దైవానుగ్రహములకు కారణాలు రాజ్యాధిపతి అయిన బుధుడు భాగ్యంలో ఉండటమే. ధర్మాన్ని ఇతరులకు చెప్పగలరు, ఆచరించగలరు. దానధర్మాలు మీ గ్రహస్థితిని మారుస్తాయి. కుజ దృష్టి వలన కఠినంగా మాట్లాడినా అవతలి వాళ్లు అర్థం చేసుకుంటారు. వక్రించిన బుధుడు అష్టమంలో ఉన్నా కీడు చెయ్యడు. రవి చంద్ర శుక్రులు అష్టమంలో వుండటం వల్ల మానసిక ఆందోళన కొంచెం ఉంటుంది. రాజ్యాధిపతి కోణములో ఉండటం, వారం మధ్యలో శుక్రుడు కలవడం వల్ల సంగీత సాహిత్యాల పట్ల అభిలాషేకాదు వాటిలో పాల్గొనే అవకాశం ఉంది. పూర్వాభాద్ర వారికి మిత్రతార తో ప్రారంభం కావున బాగానే ఉంటుంది. ఉత్తరాభాద్ర వారికి నైధనతార తో ప్రారంభం అయినప్పటికీ గురుని వలన అశుభ ఫలితాలు తగ్గుతాయి. రేవతి వారికి సాధన తార అయినా కుజుడు ఇబ్బంది కలిగిస్తాడు.
పరిహారం: త్రినాథ మేళా చేయుట శుభఫలితాలనిస్తుంది.మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ స్వరూపిణి గా లలితా అర్చన చెయ్యండి. ఖడ్గమాల చదివినా మంచి ఫలితం ఉంటుంది.