పాతబస్తీలో దారుణం: మైనర్‌ బాలికపై అత్యాచారం!..కేసు సుమోటాగా స్వీకరణ

By సుభాష్  Published on  9 May 2020 2:36 AM GMT
పాతబస్తీలో దారుణం: మైనర్‌ బాలికపై అత్యాచారం!..కేసు సుమోటాగా స్వీకరణ

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉన్నందున క్రైమ్‌ రేటు పూర్తిగా తగ్గిపోయింది. బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు, రోడ్డు ప్రమాదాలు ఇలా ఎన్నో దారుణాలు తగ్గిపోయాయి. తాజాగా హైదరాబాద్‌లో ఓ దళిత మైనర్‌ బాలికపై దారుణం చోటు చేసుకుంది. పాతబస్తీ పరిధిలోని చాదర్‌ ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ మైనర్‌ బాలికపై ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. చాలా రోజుల తర్వాత మళ్లీ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ దారుణాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్‌ సుమోటాగా స్వీకరించారు.

ఈ అత్యాచార ఘటనపై వెంటనే పోలీసులు కేసు విచారణ చేపట్టాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నివేదిక సమర్పించాలని తెలిపారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులతో మాట్లాడి బాధితురాలిని ఆర్థికంగా ఆదుకోవాలని సూచించారు.

బాధితురాలికి న్యాయం జరిగే వరకూ అన్ని విధాలుగా ఉండగా ఉండాలన్నారు. ఈ అత్యాచార ఘటనను సుమోటాగా స్వీకరించామని, ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు, చర్యలు చేపడుతున్నా.. నిందితుల్లో భయం లేకుండా పోతోందని, ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించామని అన్నారు. బాలికకు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు కమిషన్‌ అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

Next Story