మైనర్ బాలికపై అత్యాచారం
By రాణి Published on 29 Jan 2020 10:30 AM ISTదిశ ఉదంతం తర్వాత తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం మహిళల భద్రత కోసం ఎన్ని చర్యలు తీసుకున్నా...నిందితులను ఎన్ కౌంటర్ చేసినా..కామాంధుల ఆలోచనల్లో మార్పు మాత్రం కరువయింది. కనీస విజ్ఞత లేకుండా...చిన్నా పెద్దా తేడా చూడకుండా...ఆడది కనిపించడమే పాపం...అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దిశ ఉదంతం తర్వాత వెలుగులోకి వచ్చిన కేసులు కొన్నైతే...ఇంకా వెలుగు చూడని కేసులు కోకొల్లలు. మొన్నటికి మొన్న చిలకలగూడలో కూడా మైనర్ యువతి పెళ్లికి నిరాకరించిందని పగబట్టిన ప్రియుడు...రాత్రి సమయంలో ఆమెను మేడపైకి తీసుకెళ్లి చంపిన విషయం హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడేం జరిగినా...ఒక నాలుగు రోజులు దాని గురించి మాట్లాడుకుని మరిచిపోతున్నారే గాని...అసలు ఇలాంటి పని చేయడమెందుకు అని ఒక క్షణం ఆలోచన కూడా ఉండట్లేదు. కోరికలు తీర్చుకునేందుకు అమ్మాయి ఉంటే చాలు అన్నట్లుగా ఉంటోంది మన సమాజం. ఆడపిల్లలకు స్వేచ్ఛ ఇస్తున్నా...వారి స్వేచ్ఛను కొందరు కామాంధులు కబళిస్తున్నారు.
తాజాగా పంజాగుట్ట పీఎస్ పరిధిలో ఘోర సంఘటన వెలుగు చూసింది. 13 ఏళ్ల మైనర్ బాలికపై జహంగీర్ (30) కొంత కాలంగా అత్యాచారం చేస్తున్నట్లు తేలింది. రోజు రోజుకూ కూతురు నీరసించి పోతుండటంతో అనుమానం వచ్చిన తల్లి బాలికను ప్రశ్నించింది. కాసేపు తటాపటాయించినా...చివరికి నిజం చెప్పేసింది. బాలిక చెప్పిన విషయం విన్న తల్లి ఖంగుతింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు ఈ ఘటనపై పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రులు కూలి పని చేస్తూ..జీవనం సాగిస్తుంటారు. వారి ఇంటి పక్కనే ఉండే జహంగీర్ ఎంఎస్ మక్తాలో పంచర్ షాప్ నిర్వహిస్తూ ఉంటాడు. అయితే...సాయంత్రం పూట బాలిక తల్లిదండ్రులు లేని సమయం చూసి..ఆమెకు మాయమాటలు చెప్పి 10 రోజులుగా అత్యాచారం చేస్తున్నట్లు తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం జల్లెడ పడుతున్నారు. ప్రస్తుతం జహంగీర్ పరారీలో ఉన్నట్లు పంజాగుట్ట పోలీసులు పేర్కొన్నారు.