రెండేళ్ల బాలికపై దారుణం
By Newsmeter.Network Published on 29 Dec 2019 11:52 AM ISTచిన్నారులపై దారుణాలు ఆగడం లేదు. పదునెక్కిన చట్టాలు కూడా కామాంధులను అడ్డుకోలేకపోతున్నాయి. దీంతో అభంశుభం తెలియని చిన్నారులను సైతం వారు బలి చేసేస్తున్నారు. తాజాగా, పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన నుహ్ నగరంలో మరో సంఘటన వెలుగు చూసింది. హర్యానా మేవట్ జిల్లా మీదుగా వెళ్లే ఢిల్లీ, ఆల్వార్ జాతీయరహదారిని ఆనుకుని ఈ నుహ్ నగరం ఉంది.
సంఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. రెండున్నరేళ్ల చిన్నారి అదే ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల మైనర్ బాలుడు కన్నేశాడు. చిన్నారి ఇంటి ఆరుబయట ఆడుకుంటుండటం గమనించిన ఆ కామాంధుడు మాయమాటలతో సైకిల్ ఎక్కించుకుని పొలాల్లోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లాడు. ఇంతలో చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో గాలించారు.
అదే సమయంలో మైనర్ బాలుడు తన సైకిల్‌పై చిన్నారిని ఎక్కించుకుని వస్తుండటాన్ని తల్లిదండ్రులు గమనించారు. చిన్నారి వస్త్రాలు రక్తంతో తడిసి ఉండటంతో బాలుడ్ని గట్టిగా నిలదీశారు. అతని మాటల్లో తడబాటును గమనించి చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రకి తరలించగా, చిన్నారిపై అత్యాచారం జరిగినట్టు వైద్యులు నిర్ధారించారు.
15 ఏళ్ల బాలుడు రెండున్నరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డట్టు నిజ నిర్ధారణ కావడంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మైనర్ కనుక ముందుగా జువెనైల్ బోర్డు ముందు హాజరుపరిచి, ఆ తరువాత పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అరవాలిలో మరో ఘటన..
హర్యానాలోని అరవాలి ప్రాంతంలో మరో సంచలన ఘటన వెలుగు చూసింది. అరవాలి కొండలపై ఎనిమిదేళ్ల బాలిక మృతదేహం ఉండటం కలకలం రేపుతోంది. కాగా. సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మూడో తరగతి చదువుతున్న ఆ బాలిక మేకను వెతికే క్రమంలో కొండపైకి వెళ్లిందని, ఇక అప్పట్నుంచి బాలిక ఆచూకి కనిపించకపోవడంతో తమకు ఫిర్యాదు అందిందన్నారు.
తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసుకున్న తాము బాలిక ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టామని, ఆ క్రమంలో శుక్రవారం సాయంత్రం కొండపై రక్తపు మడుగులో ఉన్న బాలిక మృత దేహాన్ని కనుగొన్నట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ బాలిక మృతికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు.