మాట నిలబెట్టుకున్న సీఎం జగన్‌.. కర్నూలు అత్యాచారం కేసును సీబీఐకి అప్పగింత

By సుభాష్  Published on  27 Feb 2020 2:29 PM GMT
మాట నిలబెట్టుకున్న సీఎం జగన్‌.. కర్నూలు అత్యాచారం కేసును సీబీఐకి అప్పగింత

2017లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూలులో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసును ఏపీ సర్కార్‌ సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇటీవల కంటి వెలుగు ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా కర్నూలుకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. బాధితురాలి తల్లిదండ్రులను కలిసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ కేసును సీబీఐకి అప్పగిస్తామని వారికి మాటిచ్చారు. అలాగే ఈ విషయంపై తనతో మాట్లాడేందుకు రావాలని జగన్‌ వారికి సూచించారు.

కాగా, బాధితురాలు ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతుండగా, 2017 ఆగస్టు 19వ తేదీన అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందినట్లు పాఠశాల యాజమాన్యం పేర్కొనగా, తన కుమార్తెను అత్యాచారం చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇక పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం ఆమెపై అత్యాచారం జరిగినట్లు తేలింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పాఠశాల యాజమానితో పాటు అతని కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వారి ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు ఫోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణకు నియమించిన కమిటీ కూడా బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు నివేదిక అందించింది.

ఈ కేసు విషయంలో సాక్ష్యాలు బలంగా ఉండటంతో అప్పట్లో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కానీ 23 రోజులకే వారికి బెయిల్‌ మంజూరైంది. కాగా, అప్పటి నుంచి తమ బిడ్డ విషయంలో అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలంటూ ఆమె కుటుంబ సభ్యులు పోరాటం చేస్తూనే ఉన్నారు. అంతే కాదు జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ సైతం ఆమె కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలంటూ కర్నూలులో రెండు రోజుల పాటు ర్యాలీ కూడా నిర్వహించారు.

Next Story
Share it