రిటైర్‌మెంట్‌ ప్రకటించిన టీమిండియా క్రికెటర్‌..

టీమిండియా మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు శనివారం గుడ్‌ బై చెప్పారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు క్రికెట్‌ ఆడిన ఈ ఆటగాడు ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 2006లో సౌతాఫ్రికాతో సిరీస్‌ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన 42 ఏండ్ల జాఫర్‌ 31 టెస్టుల్లో 34.11 సగటుతో 1,944 పరుగులు చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అతడు ఐదు శతకాలు, 11 అర్ధశతకాలు సాధించాడు. అత్యధిక స్కోరు 212.

కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌ అయిన జాఫర్‌ టెక్నిక్‌ దుర్భేద్యం. గంటలకొద్దీ క్రీజులో పాతుకుపోయి బ్యాటింగ్‌ చేస్తూ శుభారంభాలు అందించడం వసీంకే చెల్లింది. ఎంతో సీనియర్‌ అయినా దరిచేరని గర్వం. చాలాకాలం కిందటే అంతర్జాతీయ క్రికెట్‌ ఆడినా ఇంకా దేశవాళీలో కొనసాగుతూ ఎందరో జూనియర్లకు మార్గదర్శనం చేయడం జాఫర్‌కే సాధ్యమైంది. ఈ మధ్యనే ఐపీఎల్‌ టీమ్‌ కింగ్స్‌ పంజాబ్‌కు బ్యాటింగ్‌ కోచ్‌గా నియమితులయ్యాడు. ఈ నేపథ్యంలో శనివారం రంజీ సహా అన్ని ఫార్మాట్ల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు తన ట్విటర్‌ ద్వారా బీసీసీఐకు అధికారిక లెటర్‌ను పంపించాడు.

1996/97లో ఫస్ట్‌క్లాస్‌ అరంగ్రేటం చేసిన అతడు రంజీ ట్రోపీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రంజీట్రోఫీలో చరిత్రలో 12వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఏకైక బ్యాట్స్‌మెన్ అతడే. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో మొత్తం 260 మ్యాచుల్లో 50.67సగటుతో 19,410 పరుగులు చేశాడు. అందులో 57 శతకాలు, 91 అర్ధశతకాలు ఉన్నాయి.

’25 సంవత్సరాలు క్రికెట్‌ ఆడాను.. ఇక ఆటకు గుడ్‌బై చెప్పాల్సిన సమయం వచ్చేసింది. క్రికెట్‌లో ఇంతగా ఎదగడానికి సహకరించిన ప్రతీ ఒక్కరికి నా కృతజ్ఞతలు. థ్యాంక్యూ బీసీసీఐ, ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌, విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌’ అని లేఖలో పేర్కొన్నాడు.

ఆటగాడిగా రంజీట్రోఫీలో సాధించిన కొన్ని రికార్డులు..

అత్యధిక మ్యాచ్‌లు (156)
అత్యధిక పరుగులు (12,308)
అత్యధిక సెంచరీలు (40)
అత్యధిక క్యాచ్‌లు (200)
ఇంకా దులీప్‌ ట్రోఫీలో అత్యధిక రన్స్‌ (2545)
ఇరానీ కప్‌లో అత్యధిక రన్స్‌ (1294).

Vamshi Kumar Thota

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *