విశ్వహిందూ మహాసభ చీఫ్‌ రంజిత్‌ బచ్చన్‌ ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. లక్నోలోని హజరత్‌గంజ్‌లో ఈ రోజు ఉదయం ఆయన సోదరుని శ్రీవాస్తవతో కలిసి మార్నింగ్‌ వాక్‌కు వెళ్లగా, బైక్‌పై వచ్చిన దుండగులు ఆయనపై కాల్పులకు పాల్పడ్డారు. దీంతో రంజిత్‌ తలలోకి బుల్లెట్‌ దూసుకుపోవడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక కాల్పుల్లో గాయపడ్డ సోదరుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన లక్నోలో సంచలనం రేపింది.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారి కోసం ప్రత్యేక బృందం రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు. నిందితులను త్వరగా పట్టుకుంటామని తెలిపారు. కాగా, 2019 అక్టోబర్‌లో హిందూ సమాజ్‌ పార్టీ నాయకుడు కమలేష్‌ తివారీని కాల్చి చంపిన విషయం తెలిసిందే.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.