'దిశ' ఘటనే నా తదుపరి చిత్రం : వర్మ
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Feb 2020 12:38 PM GMTయధార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దిట్ట అన్న విషయం తెలిసిందే. ఇందుకు నిదర్శనం.. ఇప్పటివరకూ వర్మ దర్శకత్వం వహించిన వివాదస్పద చిత్రాలే. ఇదిలావుంటే.. వర్మ తాజాగా కొద్ది రోజుల క్రితం మొత్తం దేశాన్ని కుదిపేసిన 'దిశ' ఘటన ఆధారంగా సినిమా తీయనున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని తన అధికారిక ట్విటర్ అకౌంట్ ద్వారా తెలిపాడు.
వర్మ ట్విట్టర్ ద్వారా వివరాలను వెల్లడిస్తూ.. దిశ అత్యాచార ఘటన జరిగిన ప్రాంతానికి సంబంధించిన ఫోటోలను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ‘దిశ అత్యాచారం, హత్య ఘటనల ఆధారంగా సినిమా ఉంటుందని.. ఆ సినిమాకు ‘దిశ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశామని పోస్టులో తెలిపాడు.
ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత.. మరలా ఇక్కడ అత్యంత పాశవికంగా ఓ యువతిపై అత్యాచారం చేసి.. అనంతరం సజీవదహనం చేశారని.. నిర్భయ దోషుల నుండి కొత్తగా వస్తున్న అత్యాచార దోషులు ఏం నేర్చుకుంటున్నారో.. ‘దిశ’ సినిమాలో భయంకరమైన గుణపాఠంగా చెప్పబోతున్నామంటూ వర్మ ట్వీట్ చేశాడు.
నిర్భయను అత్యాచారం చేసి రోడ్డు మీద వదిలివెళ్లారు. అలా చేస్తే శిక్ష పడదు అనుకున్నారు. కానీ పోలీసులకు చిక్కారు. అలాంటి పరిస్థితి తమకు రాకూడదని దిశను ఆ దోషులు కాల్చి చంపారు. నిర్భయ దోషులను ఈ రోజు ఉరి వేయాల్సింది. కానీ మురికి న్యాయవాది ఏపీ సింగ్ పిటిషన్ వేసి ఉరిశిక్ష వాయిదా పడేలా చేశారు’ అంటూ వర్మ వరుస ట్వీట్లు చేశాడు. అంతకుముందు కూడా వర్మ.. నిర్భయ దోషులకు ఉరిశిక్ష వాయిదా పడటంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.