వందల ఏళ్లనాటి రామప్ప ఆలయానికి వాస్తుదోషం

By రాణి  Published on  24 Jan 2020 8:26 AM GMT
వందల ఏళ్లనాటి రామప్ప ఆలయానికి వాస్తుదోషం

ముఖ్యాంశాలు

  • 800 సంవత్సరాలనాటి రామప్ప ఆలయానికి వాస్తుదోషం
  • పడమర దిశనుంచి లోపలికి వెళ్లేందుకు భక్తులకు దారి
  • సోమసూత్రాన్ని దాటుకుంటూ వెళ్లడం నిషిద్ధం
  • భక్తులు తూర్పు వైపునుంచి లోపలికి ప్రవేశించాలి
  • మార్పులు చేర్పులు చేస్తే ఆలయానికి అఖండ వైభవం
  • ప్రత్యేక వినతిపత్రాన్ని సమర్పించిన ప్రధానార్చకుడు
  • చర్యలకు ఆదేశించిన ములుగు జిల్లా కలెక్టర్
  • తూర్పు దిశగా ప్రత్యేకమైన రోడ్డు మంజూరు

వందల ఏళ్ల చరిత్ర కలిగిన తెలంగాణ రాష్ట్రంలోని ములుగు ప్రాంతంలో ఉన్న రామప్ప ఆలయం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పురాతనమైన దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్ కూడా ఉంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయం అలనాటి నుంచీ చరిత్రలో ప్రత్యేకమైన స్థానాన్నీ, గుర్తింపును అయితే పొందగలిగిందిగానీ ఇబ్బడిముబ్బడిగా భక్తులను మాత్రం ఆకర్షించలేకపోతోంది. ఈ పరిస్థితికి కేవలం వాస్తు దోషమే కారణమన్న విషయాన్ని ఆలయ ప్రధానార్చకులు ఎంతో కాలంగా చెబుతూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించింది. ఆలయంలోకి భక్తులు పశ్చిమముఖంగా ప్రవేశిస్తున్నారనీ, కానీ నిజానికి భక్తులు లోపలికి తూర్పు ముఖంగా రావాలనీ ఆలయ ప్రధాన అర్చకులు అధికారులకు తెలిపారు.

ఇలా లోపలికి వచ్చేటప్పుడు శాస్త్రం ప్రకారం సోమసూత్రాన్ని దాటకూడదు. కానీ రామప్ప ఆలయంలో మాత్రం భక్తులు నేరుగా పశ్చిమం నుంచి లోపలికెళ్లేటప్పుడు సోమసూత్రాన్ని దాటుకుంటూ వెళ్లాల్సొస్తుంది. 1213లో ఈ ఆలయాన్ని నిర్మించారు. 800 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం ఇది. కేవలం ఈ వాస్తుదోషంవల్లే ఈ ఆలయానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రావడంలేదనీ, అభివృద్ధి చెందడం లేదనీ పేర్కొంటూ, వెంటనే ఈ వాస్తుదోషాన్ని సరిచేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆలయ ప్రధానార్చకులు ఉమాశంకర్ ములుగు జిల్లా కలెక్టర్ కు ఓ వినతిపత్రాన్ని సమర్పించారు.

జిల్లా అధికారులు వెంటనే స్పందించి తూర్పువైపున 80 అడుగుల రోడ్డును ఆలయానికి శాంక్షన్ చేశారు. ఈ రోడ్డు మెయిన్ రోడ్డునుంచి నేరుగా వెళ్లి ఆలయానికి తూర్పు దిశలో కలుస్తుంది. అంటే ఇకపై నేరుగా భక్తులు తూర్పు దిశనుంచి ఆలయంలోకి ప్రవేశించడానికి వీలవుతుంది. రోడ్డు నిర్మాణం పనులు ఆగమేఘాల మీద జరుగుతున్నాయనీ, మేడారం జాతరనాటికి పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం పూర్తవుతుందనీ కాంట్రాక్టర్ అంటున్నారు. మరోవైపు ప్రధాన ఆలయానికి కుడివైపున ఉన్న కామేశ్వరాలయం కూల్చివేయబడింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీన్ని పునర్నిర్మించేందుకు కృషి చేస్తోంది.

Next Story