ఇనుము, ఉక్కు లేకుండానే అబుధాబీ హిందూ మందిర నిర్మాణం

By రాణి  Published on  15 Feb 2020 5:01 AM GMT
ఇనుము, ఉక్కు లేకుండానే అబుధాబీ హిందూ మందిర నిర్మాణం

గల్ఫ్ దేశం అబూధాబీలో నిర్మాణమౌతున్న మొట్టమొదటి హిందూ మందిరం నిర్మాణంలో ఉక్కు, ఇనుమును అస్సలు వాడటం లేదు. ఈ దేవాలయాన్ని ప్రాచీన భారతీయ మందిర నిర్మాణ శైలిలో, ఇనుము ఉక్కు లేకుండా నిర్మించబోతున్నారు. రెండేళ్ల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో భూమిపూజ చేసుకున్న తరువాత, స్వామినారాయణ మందిరం కోసం గురువారం పునాదుల్లో ఫ్లై యాష్ కాంక్రీట్ ను వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ మూలానికి చెందిన వారు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పాల్గొన్న వారిలో యూఏఈ లో భారత రాయబారి పవన్ కపూర్, దుబాయిలోని కౌన్సుల్ జనరల్ విపుల్, భారతీయ మూలానికి చెందిన వ్యాపారులు, కమ్యూనిటీ డెవలప్ మెంట్ అధికారులు పాల్గొన్నారు. దాదాపు మూడు వేల క్యూబిక్ మీటర్ల మేరకు ఫ్లైయాష్ కాంక్రీట్ ను పునాదుల్లో పోయడం జరిగింది. ఒకే సారి ఇంత పెద్ద మొత్తంలో కాంక్రీట్ ఫ్లై యాష్ ను వేయడం ప్రపంచ చరిత్రలోనే ఇదే తొలిసారి.

ఈ మందిరానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ మందిర నిర్మాణం కోసం దాదాపు మూడు వేల మంది కార్మికులు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. 500 టన్నుల ఇటాలియన్ కర్రారా చలువరాయితో విగ్రహాలు, మూర్తులు, శిల్పాలను చెక్కుతున్నారు. మందిర స్తంభాలు, గోడలు, ఇతర కట్టడాలు దాదాపు 12250 టన్నుల గులాబీ రంగు ఇసుక రాతితో తయారు చేస్తున్నారు. పూర్తిగా నిర్మాణమైన తరువాత గల్ఫ్ ప్రాంతంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా ఇది విలసిల్లుతుంది.

సీ డీ యే సీ ఈ ఓ ఉమర్ అలీ ముతన్నా భారతీయ మూలానికి చెందిన వారి ఆధ్యాత్మిక అవసరాలను ఈ కట్టడం తీరుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వామినారాయణ సంస్థ సీనియర్ నేత బ్రహ్మ విహారీ దాస్ కూడా పాల్గొన్నారు.

Next Story