భీమ‌వ‌రం గ‌ట్టుపై రాజుల ఫైట్ ! రాజ్యసభ సీటు ఏ రాజుకో ?

By రాణి  Published on  17 Dec 2019 9:52 AM GMT
భీమ‌వ‌రం గ‌ట్టుపై రాజుల ఫైట్ ! రాజ్యసభ సీటు ఏ రాజుకో ?

భీమ‌వ‌రం. ఈ ఊరు ఆంధ్ర లాస్‌వెగాస్‌ గా పేరు తెచ్చుకుంది. ఇక్క‌డ రాజుల ఆధిప‌త్యం కొన్ని రోజులుగా న‌డుస్తోంది. నరసాపురం రాజకీయం ఎప్పుడూ రాజుల చుట్టూనే తిరుగుతుంది. 2014 ముందు ఇద్దరు కనుమూరి, గోకరాజు కుటుంబాల మధ్య టికెట్ ఫైట్‌ నడిచింది. ఇద్దరు ఒకే సామాజిక వర్గం...అంతకు మించి దగ్గర బంధుత్వమే ఉంది. అయితే ఈ ఇద్దరు రాజులు అధికారం కోసం ఎత్తుల పై ఎత్తులు వేస్తున్నారు. ఒకసారి ఒకరు పై చెయ్యి సాధించి మరొకరి కి చెక్ పెడుతుంటే రెండోసారి మరొకరు పై చేయి సాధిస్తున్నారు.

అయితే ఇటీవలే గోకరాజు కుటుంబం వైసీపీ లో చేరటం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక పార్టీలో గోకరాజు గంగరాజు, మరో పార్టీలో కనుమూరి రఘురామ కృష్ణమరాజు ఉండటంతో నరసాపురం పార్లమెంట్ పరిధిలో పై చేయి ఎవరు సాధిస్తారన్న అంశంపై చర్చ జరుగుతోంది. గోకరాజు గంగరాజు న‌ర‌సాపురం మాజీ ఎంపీ. ఈయన బీజేపీలో ఉన్నారు. ఆయన బావ మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు కాంగ్రెస్ లో ఉన్నారు. బాపిరాజు అన్న కొడుకు కనుమూరి రఘురామకృష్ణమరాజు. ఈయ‌న ప్ర‌స్తుత వైసీపీ ఎంపీ. ఇలా వీరందరూ బంధువులు. గోకరాజు గంగరాజు, రఘురామ కృష్ణమరాజు లు ఒకప్పుడు వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. కానీ మధ్యలో ఏం తేడాలొచ్చాయో ఏమో తెలీదు గానీ విడిపోయారు. వ్యాపారంలో వచ్చిన తేడాలే వారిమధ్య దూరం పెంచాయని, అది కాస్తా రాజకీయ వైరంగా మారటానికి కారణమైందని తెలుస్తోంది.

  • 2014లో గంగ రాజు..2019లో కృష్ణ‌మ‌రాజు

2014లో నర్సాపురం ఎంపీగా పోటీ చేయాల‌ని రఘురామ కృష్ణమరాజు ప్లాన్ వేశారు. ఈ మేరకు టిడిపిలోకి వెళ్లి ఎంపీ టికెట్ కోసం ట్రై చేశారు. అయితే పొత్తు ఉంది కాబట్టి బీజేపీలోకి వెళితే టికెట్ వ‌స్తుంద‌ని ఆ పార్టీలో చేరారు. అయితే ఆర్ఎస్ఎస్ నుండి పావులు కదిపి బిజెపి తరపున గోకరాజు గంగ రాజు నరసాపురం సీటు తెచ్చుకున్నారు. అలా 2014 లో రఘురామ కృష్ణమరాజు కు చెక్ పెట్టారు గంగరాజు. ఆ తర్వాత బిజెపి లో రఘురామ కృష్ణ‌మ‌రాజు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో టిడిపిలో చేరి నరసాపురం పార్లమెంట్ ఇన్ చార్జ్‌ అయ్యారు. 2019 ఎన్నిక‌ల సమయం వ‌చ్చేసరికి గోక‌రాజు గంగ‌రాజు త‌న కొడుకును వైసీపీలోకి పంపాల‌ని ప్లాన్ వేశారు. ఈ విష‌యం ముందే ప‌సిగ‌ట్టిన ర‌ఘురామ‌ కృష్ణ‌మ‌రాజు వాళ్ల కంటే ముందు వైసీపీలో చేరి, న‌ర‌సాపురం నుంచి ఎంపీగా గెలిచారు. అయితే గంగరాజు పోటీలో నిలబడలేదు. ఇదంతా గ‌తమైతే ఇప్పుడు రాజుల మ‌ధ్య ఆధిప‌త్యం ఆస‌క్తిక‌రంగా మారింది.

  • రంగరాజుకు సీటొచ్చేనా ?

గోకరాజు నరసింహరాజు, రామరాజు, జీవీకే రంగరాజులు వైసీపీలో చేరారు. జీవీకే రంగరాజు నరసాపురం గంగరాజుకు పెద్ద కుమారుడు. నరసింహ రాజు, రామరాజు గంగరాజుకు సోదరులు. అయితే వీరి చేరిక సమయంలో రఘురామ కృష్ణమరాజు వారితో సీఎం జగన్ వద్దకు వెళ్లలేదు. మరోవైపు ఇప్పటి వరకు గంగరాజు క్యాంపు కార్యాలయంగా ఉన్న బీజేపీ ఆఫీసుకు వైసీపీ రంగులు పడుతున్నాయి. పలువురు లోకల్ నాయకులు వీరిని కలుస్తున్నారు. అయితే పార్టీలో చేరిన గంగరాజు కుటుంబ సభ్యులు సిట్టింగ్ ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణమరాజును కలవలేదు. కనుమూరి రఘురామ కృష్ణమరాజు బిజెపి నాయకులతో టచ్ లో ఉండటం, బిజెపి లోకి త్వరలో చేరతారన్న ఊహాగానాలు వ్యక్తమవుతుండటంతో గోకరాజు గంగరాజు రఘురామ కృష్ణమరాజుకు చెక్ పెట్టేందుకే తన కుమారుడు, సోదరులను వైసిపిలోకి పంపారన్న వార్తలు వినిపిస్తున్నాయి. రఘురామ కృష్ణమరాజు మాత్రం ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వైసీపీని వీడేది లేదని తేల్చేశారు. రఘురామ పార్టీని వీడితే రంగరాజుకు రాజ్యసభ సీటు ఇస్తారా ? ఆయన పార్టీలోనే ఎంపీగా కొనసాగినా రంగరాజుకు రాజ్యసభ సీటు దక్కుతుందా? ఏదేమైనా రంగరాజుకు రాజ్య‌స‌భ సీటు ఇస్తార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న నేపధ్యంలో ఈ రెండు కుటుంబాల రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయనే చర్చ జరుగుతోంది.

Also Read

Next Story