కలెక్టర్ కు తిక్కరేగితే.. ఇలానే ఉంటుంది మరి..

By అంజి  Published on  23 March 2020 2:42 PM GMT
కలెక్టర్ కు తిక్కరేగితే.. ఇలానే ఉంటుంది మరి..

కరోనా బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాల్సిన సమయం ఇది. దేశంలో ఇప్పటికే కరోనా మహమ్మారి రెండవ స్టేజ్ లో ఉందని, మూడో స్టేజ్ కి వస్తే తట్టుకోవడం కష్టమని చెప్పేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు సెలవులిచ్చి ఇంట్లోనే విశ్రాంతి తీసుకోమంటే..ఏమీ తోచక బైక్ లు, కార్లేసుకుని రోడ్లపై విచ్చల విడిగా తిరుగుతున్నారు. కర్ఫ్యూ విధించిన 14 గంటలు కూడా చాలా కష్టంగా గడిపారు. ఇక క్షణం కూడా కాలు ఒక్కచోట నిలవని వారైతే సరేసరి. రోడ్డుమీదికి రాకపోయినా కాలుకాలిన పిల్లిలా ఆ వీధిలోనే అటూ ఇటూ తిరిగారు కూడా. చిన్న చిన్న వీధుల్లో అయితే పోలీసులుండరు కదా. తిరిగితే కరోనా వచ్చేస్తుందా ఏంటి అని వారి ధీమా.

సోమవారం నుంచి 31 వరకూ తెలంగాణ లాక్ డౌన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆదేశాలను ఎవరూ చెవికెక్కించుకోలేదు. చాలా నిర్లక్ష్యంగా రోడ్లపై తిరిగారు. సిగ్నల్స్ వద్దనున్న పోలీసులు, మీడియా వాహనదారులను ఆపి ప్రభుత్వం ఎక్కడికి వెళ్లొద్దని చెప్పింది కదా..ఎక్కడికెళ్తున్నారు ? ఎందుకెళ్తున్నారని ప్రశ్నిస్తే..సెలవులిచ్చారుగా మా సొంతఊరికి వెళ్తున్నాం. మా చుట్టాల ఇంటికి వెళ్లొస్తున్నాం. మా ఆఫీసులకు సెలవులివ్వలేదు ఆఫీసులకెెళ్తున్నాం అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానమిచ్చారు. ప్రజలంతా ఒకేసారి గుమిగూడద్దంటే..సోమవారం తెల్లవారేసరికే రైతు బజార్లలో వందలమంది జనం దర్శనమిచ్చారు.

ఇక సిరిసిల్లలో అయితే ఏకంగా కలెక్టరే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. పోలీసులు చెప్తున్నా వినకుండా ఎవరిమానాన వారు చెప్పేది మాకు కాదన్నట్లే బైక్ లు, కార్లేసుకుని తిరుగుతుంటే కలెక్టర్ కు చిర్రెత్తింది. కోపం పట్టలేక రోడ్డుపై వెళ్తున్న వాహనదారులందరికీ క్లాస్ పీకారు. కలెక్టర్ భాస్కర్ రోడ్లపై అనవసరంగా తిరుగుతున్న వాహనదారులను తిట్టి వెనక్కి పంపించారు.

'' మీరేమైనా గొప్పోళ్లా..మీకు స్పెషల్ గా చెప్పాలా ? ఎవడు రమ్మనాడు మిమ్మల్ని ఇంటి నుంచి ? మర్యాదగా వెనక్కు వెళ్లు. పో ఇక్కడి నుంచి..పో వెనక్కి పో..నిత్యావసరాలకైతే ఇంటికి ఒకరే రావాలని చెప్పారు కదా. ఇద్దరిద్దరు ఎందుకొస్తున్నారు ? '' ఇలా ఒక్కరిపై కాదు. కలెక్టర్ కు కనిపించిన వారందరిపై నిప్పులు చెరిగారు.

ఇదండీ సంగతి. కలెక్టర్ కాబట్టి మాటలతో సరిపెట్టారు. ఇప్పటి నుంచి నిబంధనలు మరింత కఠిన తరం అయ్యాయి కాబట్టి..కుంటిసాకులతో బయట తిరగాలని చూస్తే మాత్రం మీకు పోలీసుల చేతిలో బడితపూజే. లాఠీ దెబ్బలు తినాలని అంత ఆత్రుతగా ఉంటే మీ ఇష్టం వచ్చినట్లు బయట తిరగండి.

Next Story