పొలిటికల్ పార్టీ దిశగా రజనీ అడుగులు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 Nov 2019 4:15 PM GMTముఖ్యాంశాలు
- పొలిటికల్ పార్టీ పెట్టడానికి రెడీ అవుతోన్న రజనీ
- రాజకీయ వ్యూహకర్త కోసం తలైవర్ వెతుకులాట!
- కొత్త టీవీ ఛానల్ పెట్టే ఆలోచనలో బాబా
సూపర్‌స్టార్ రజనీకాంత్ మళ్లీ రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఆధ్యాత్మిక పర్యటన తర్వాత కబాలీ వేగం పెంచారు. సినిమాలు చేస్తూనే కొత్త పార్టీ ఏర్పాటుపై మంతనాలు జరుపుతున్నారు. రాజకీయ వ్యూహకర్తలతో సంప్రదింపులు, పార్టీ పదవుల కేటాయింపులపై చర్చలతో బిజీబిజీగా ఉన్నారు.
ఒక అడుగు ముందుకు- నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటకల్ జర్నీ. 2017లోనే రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేసిన తలైవా, రెండేళ్లు గడిచినా ఇంకా పార్టీని ఏర్పాటు చేయలేదు. ఆథ్యాత్మిక రాజకీయాలు అంటూ కొత్త స్లోగన్‌తో ప్రజల ముందుకు వచ్చిన రజనీ, పార్టీ ఏర్పాటు, ప్రకటనపై మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. 2021లో జరిగే శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతామంటూ అభిమానులను ఖుషీ చేసిన కబాలీ, ఇప్పుడు పొలిటికల్‌గా వేగం పెంచారు. హిమాలయ పర్యటన ముగించుకొని చెన్నైకి వచ్చిన తర్వాత పార్టీ ఏర్పాటుపై కసరత్తు ముమ్మరం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. ఆలోపే పార్టీని ప్రారంభించడం, పార్టీ గుర్తు-సిద్ధాంతాలు-ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తీసుకోవాల్సిన చర్యలను వేగవంతం చేశారు. సాధ్యమైనంత త్వరలోనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడంతో పాటు తిరుగులేని విధంగా ఎంట్రీ ఇవ్వాలని రజనీ భావిస్తున్నారు.
రాజకీయ వ్యూహకర్త కోసం వెతుకులాట
నాయకుడు మాత్రమే బలంగా ఉంటే సరిపోదు. మంత్రి కూడా అంతే చురుగ్గా ఉండాలి. నాయకత్వానికి, మెరుగైన చాణక్యం తోడైతేనే కార్యసిద్ది కలుగుతుంది. రజనీ కూడా ఇదే ఆలోచిస్తున్నారు. పొలిటికల్ ఎంట్రీ, ఎన్నికల్లో వ్యూహ ప్రతివ్యూహాలకు సరైన వ్యూహకర్త కావాలని కబాలీ అనుకుంటున్నారు. ఇందుకోసం టాప్ పొలిటికల్ అనలిస్టులను సంప్రదిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పేరొందిన ప్రశాంత్ కిషోర్‌ను సంప్రదించాలని రజనీకాంత్ భావించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే పీకేతో భేటీ కావడానికి ప్రయత్నించినప్పటికీ అప్పుడు కుదరలేదు. ఐతే, పీకే వ్యూహలు ఉత్తరాది రాష్ట్రాల్లో మా త్రమే చెల్లుబాటు అవుతాయని, దక్షిణాది రాష్ట్రాల్లో అందునా తమిళనాడులో పెద్దగా వర్కవుట్ కావని సన్నిహితులు రజనీని హెచ్చరించినట్లు తెలుస్తోంది. కబాలీ వెనకడుగు వేయడంతో లోకనాయకుడు ఎంట్రీ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికలు, శాసనసభ ఉప ఎన్నికల్లో పీకే సేవలను వినియోగించుకున్నారు. ఐతే, పీకే ఎత్తుగడలు కమల్‌కు కలసి రాలేదు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనకు కూడా పీకే వ్యూహాలు పనిచేయలేదు. దీంతో రజనీకాంత్ మరో వ్యక్తి కోసం గాలించారు.
తమిళనాడుకు చెందిన రాజకీయ వ్యూహకర్త జాన్ ఆరోగ్యస్వామిపై రజనీకాంత్ దృష్టి పడింది. రాష్ట్ర రాజకీయాలు, సామాజిక వర్గాల ప్రభావం, కుల-మతాల లెక్కలపై జాన్ ఆరోగ్యస్వామికి పట్టుంది. 2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పీఎంకే తరఫున జాన్ పని చేశారు. ఆ ఎన్నికల్లో పీఎంకే ఓటు బ్యాంకు 4 శాతం నుంచి 6 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో జాన్ ఆరోగ్యస్వామిని సంప్రదించాలని రజనీ టీం భావిస్తోంది.
కొత్త టీవీలో ఆలోచనలో బాబా
పొలిటికల్ చాణక్యునితో పాటు సొంతంగా టీవీ ఛానల్ పెట్టాలని రజనీ బృందం అనుకుంటోంది. ప్రస్తుతం తమిళనాట ప్రతీ ముఖ్యమైన పార్టీకి అనుబంధంగా ఓ ఛానెల్ ఉంది. పార్టీ వ్యవహారాలు, సిద్దాంతాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ఛానెళ్లను ఉపయోగించుకుంటున్నారు. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడానికి, రాజకీయంగా ఎదురుదాడి చేయడానికి సొంతంగా ఓ ఛానెల్ ఉండాలని సన్నిహితులు రజనీకి గట్టిగానే చెబుతున్నట్లు సమాచారం. పార్టీ ప్రారంభానికి, ఎన్నికలకు సమయం తక్కువగా ఉంటుందని, అలాంటప్పుడు పార్టీ సిద్దాంతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాలంటే ఓన్ ఛానెల్ తప్పదని రజనీ సన్నిహితులు చెబుతున్నారు. ఛానల్‌కు తలైవర్ ,రాఘవేంద్ర , బాబా పేర్లు పెట్టే అవకాశాలున్నాయని సమాచారం. అలాగే, తమిళుల మనోభావాలు, ఆలోచనలు బాగా తెలిసిన అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు, రాజకీయ విమర్శకుణ్ని కూడా రంగంలోకి దింపనున్నారని తెలుస్తోంది.
కోశాధికారి పదవి మహిళకు కేటాయించే అవకాశం
పార్టీ విషయంలో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రారంభానికి ముందే ఎన్నికల కమిషన్‌లో నమోదు చేయాలని భావిస్తున్నారు. పార్టీ అధ్యక్షునిగా రజనీకాంత్, ప్రధాన కార్యదర్శిగా రజనీ సన్నిహితుడు సుధాకర్ ఉండనున్నారు. కోశాధికారి పదవిని మహిళకు కేటాయిస్తారని సమాచారం. రజనీకాంత్ భార్య లతకు కూడా పార్టీలో కీలక పోస్టు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. పార్టీ మహిళా విభాగం అధ్యక్ష పదవిని కేటాయిస్తారని అనుకుంటున్నారు. అలాగే, పార్టీలో వివిధ పదవులకు నిర్వాహకులను ఖరారు చేస్తు న్నారని సమాచారం. కీలక పదవుల్లో సింహభాగం రజనీ మక్కళ్ మండ్రం ప్రతినిధులకు ఇవ్వనున్నారు. పార్టీలో కొత్తగా చేరినవాళ్లతో పాటు మొదటినుంచీ వెంట ఉన్నవాళ్లకు సమానంగా అవకాశాలు ఇస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని రజనీ బృందం అంచనా వేస్తోంది. మొత్తంగా కాస్త లేటైనా ఫుల్ ప్రిపేర్డ్‌గా లేటెస్ట్‌గా ఎంట్రీ ఇవ్వాలన్నది కాలా ఆలోచన. మరి ప్రజల ఆలోచన ఎలా ఉంటుందో..?