రాజకీయ బేతాళం:స్క్రీన్ ప్లే, దర్శకత్వం చంద్రబాబు-నటన పవన్ కళ్యాణ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2019 8:07 AM GMT
రాజకీయ బేతాళం:స్క్రీన్ ప్లే, దర్శకత్వం చంద్రబాబు-నటన పవన్ కళ్యాణ్

పట్టువదలని విక్రమార్కుడు బోటులో వస్తున్నాడు. విక్రమార్కుని దూరం నుంచే చూసిన బేతాళుడు "ఏంటి విక్రమార్కా గుర్రం పోయి బోటు వచ్చింది ఏంటి సంగతి?"అని నిలదీశాడు. విక్రమార్కుడు చెట్టుదాకా వచ్చి చెట్టుకింద బోటు ఆపాడు."ఏం చేయమంటావ్ బేతళా? ఏపీలో పదేళ్లుగా లేని వర్షాలన్నీ ఇపుడే కురుస్తున్నాయి. చంద్రబాబు నాయుడు సిఎంగా ఉంటే వర్షాలు కురవవు కదా..ఆ బాకీ అంతా వానదేవుడు జగన్ మోహన్ రెడ్డి సిఎం కాగానే తీర్చేస్తున్నట్లున్నాడు" అన్నాడు.

సరేలే బోటులోనే ఉండి నేనే అక్కడికి వస్తాను అని బేతాళుడు చెట్టు పై మాయమై విక్రమార్కుడి పక్కనే బోటులో ప్రత్యక్షమయ్యాడు. ఈ సారికి నీ పక్కనే కూర్చుని కథ చెబుతాలే అని మొదలు పెట్టాడు బేతాళుడు.

"విక్రమార్కా...జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఇవ్వాళ లారీ డ్రైవర్లతో మీటింగ్ పెట్టి..ఏపీకి చాలా ముందుగానే ఎన్నికలు రావచ్చునని అన్నారు. కొంతకాలంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఏపీకి ముందస్తు ఎన్నికలు వస్తాయని అంటూనే ఉన్నారు. రాజకీయాలకు కొత్త అయినా పవన్ కళ్యాణ్ కూడా రాటుదేలాడా? ముందస్తు ఎన్నికలు వస్తాయని ఆయన ఎలా చెబుతున్నారు? గతంలో చంద్రబాబుకు సన్నిహితుడైన నటుడు శివాజీకి గరుడ ఆపరేషన్ గురించి ఢిల్లీ నుంచి అర్ధరాత్రి ఎవరో ఫోను చేసి చెప్పినట్లే... పవన్ కళ్యాణ్ కు కూడా ఢిల్లీ లో ఎవరైనా అజ్ఞాత స్నేహితులు ఉన్నారా ఏంటి? లేదా ఎన్నికల సంఘంలో ఎవరైనా అధికారులు పవన్ కు ఉప్పందిస్తున్నారా? పవన్ వ్యాఖ్యల వెనుక పరమార్ధం ఏంటి? నిజంగానే ముందస్తు ఎన్నికలు వస్తాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసీ కూడా చెప్పకపోయావో నీ తలతో పాటు నీ బోటు కూడా వెయ్యి వక్కలైపోతుంది జాగ్రత్త" అని బేతాళుడు ముగించాడు.

బోటును ముందుకు నడుపుతూ విక్రమార్కుడు చెప్పడం మొదలు పెట్టాడు.

"బేతాళా..నువ్వనుకుంటోన్నట్లు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాటు దేలారో లేదో నాకు తెలీదు కానీ...ముందస్తు ఎన్నికలపై ఆయన చెప్పింది మాత్రం చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టే తప్ప మరోటి కాదు. అదే కాదు ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు మాత్రమే అయ్యింది. అయితే మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు నాయుడు రోజూ తీవ్ర మనస్తాపంతో ప్రభుత్వంపై ఏదో ఒక ఆరోపణ చేస్తూనే ఉన్నారు. భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు ఇసుక తవ్వకాలు ఉండవని అందరికీ తెలుసు.అయినా చంద్రబాబు నాయుడు ఏపీలో ఇపుడు ఇసకే దొరకడం లేదని..దానికి ప్రభుత్వానిదే బాధ్యతని రాజకీయం చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ కూడా అచ్చం చంద్రబాబు నాయుడి భాషలోనే ఇసుక రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడే కాదు..మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ...చంద్రబాబు నాయుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేతపై ఏ ఆరోపణలు చేసినా..ఆ వెంటనే పవన్ కళ్యాణ్ కూడా అవే ఆరోపణలను జగన్ పై చేశారు. తెలంగాణాలో ఉన్న ఆంధ్రోళ్లని కొట్టేస్తున్నారంటూ చంద్రబాబు తో పాటు పవన్ కళ్యాణ్ కూడా విష రాజకీయాలు చేశారు. ప్రాంతాల మధ్య చిచ్చు రేపారు.

చంద్రబాబు నాయుడి పాలనలో జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్నను దారుణంగా హత్య చేస్తే...బాధ్యత వహించాల్సిన చంద్రబాబు ఆ హత్యానేరాన్ని జగన్ మోహన్ రెడ్డిపైకి నెట్టి ఎన్నికల రాజకీయం చేశారు.ఆ వెంటనే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు తరహాలోనే జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న హత్యఘటనను రాజకీయాలకు వాడుకున్నారు. ఇలా ప్రతీ అంశంలోనూ చంద్రబాబు ఏం చెబితే అది..ఆయన ఏం చెప్పమంటే అదే పవన్ కళ్యాణ్ చెబుతూ వస్తున్నారు. ఇపుడు కూడా ఇసుక కొరత గురించి క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు.ఇక ముందస్తు ఎన్నికల విషయానికి వస్తే.. మొన్నటి ఎన్నికల్లో ఓటమిని చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు తో పాటు ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న పవన్ కళ్యాణ్ కూడా తానెందుకు ఓడారో అర్ధం కాక జుట్టు పీక్కుంటున్నారు. ఇద్దరికీ తమ తమ పరాజయ పరాభవాలు గుండెను మండించేస్తున్నాయి. అయిదేళ్ల పాటు తాను ప్రతిపక్షంలో ఉండక తప్పదన్న వాస్తవాన్ని కూడా చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే జగన్ మోహన్ రెడ్డి అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండరని అనుకున్నదానికంటే ముందుగానే ఏపీకి ఎన్నికలు వస్తాయని చంద్రబాబు కలలు కనడం మొదలు పెట్టారు. ఆ కలనే ఆయన ప్రచారం చేస్తూ పోతున్నారు. ఇపుడు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు కలనే తన జ్ఞానంగా ప్రచారం చేసుకుపోతున్నారు. అంతే తప్ప ముందస్తు ఎన్నికలనేవి లేనే లేవు. 2024లోనే మళ్లీ ఏపీకి ఎన్నికలు వస్తాయి. అంతదాకా చంద్రబాబు నాయుడికి మనోవేదన తప్పదు .చంద్రబాబు పెంపుడు చిలకలా వ్యవహరిస్తోన్న పవన్ కళ్యాణ్ కి కూడా ఈ బాధ తప్పదు" అని విక్రమార్కుడు ముగించాడు.

విక్రమార్కుని సమాధానాలు విండంతోనే బేతాళుడు సంతృప్తుడై బోటులోంచి మాయమై తిరిగి చెట్టుకు వేలాడాడు.

-వీర పిశాచి

Next Story