అన్నదాతలకు శుభవార్త.. 'రైతుబంధు' నిధుల విడుదల

By అంజి  Published on  21 Jan 2020 3:22 AM GMT
అన్నదాతలకు శుభవార్త.. రైతుబంధు నిధుల విడుదల

రాష్ట్ర రైతులకు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. నాలుగో విడత రైతు బంధు పెట్టుబడి డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో జమచేయనున్నట్టు ప్రకటించింది. ఇందు కోసం రూ.5,100 కోట్లు విడుదల చేసినట్లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి జీవో 37ను ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం కేసీఆర్‌ గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు మందు రైతు బంధు పథకాన్ని ప్రతిష్మాత్మకంగా ప్రారంభించారు. ఖరీఫ్‌, రబీ సీజన్లకు గాను ప్రతి రైతుకు ఎకరాకు రూ.5 వేలు ఇస్తున్నారు. 2019-20 వార్షిక బడ్జెట్‌లో రైతుబంధు కోసం రూ.12,862 కోట్లు కేటాయించారు.

ఇప్పటికే మూడు విడతల్లో రైతులకు పెట్టుబడి సహాయం చేశారు. ఇప్పుడు నాలుగో విడత రైతుల పెట్టుబడి సహాయానికి కూడా డబ్బులు మంజూరు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు, దేశం ఆర్థిక మాంద్యంలో ఉన్నా కూడా రైతులకు పెట్టుబడి సహాయం చేసేందుకు కేసీఆర్‌ ముందుకు వచ్చారు. నిధుల మంజూరుకు త్వరలోనే పరిపాలనా అనుమతులు రానున్నాయి. ఆ వెనువెంటనే ఆర్థిక శాఖ నుంచి నేరుగా డబ్బులు రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో జమకానున్నాయి. రైతుబంధు పథకం డబ్బులు త్వరలో రానున్నాయని తెలిసిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలు కారణాల వల్ల ఈ నిధులు రెండు నెలలు ఆలస్యంగా మంజూరు అయ్యాయి. కాగా పలువురు కొత్త రైతుల ఖాతాలను కూడా వ్యవసాయ అధికారులు రైతుబంధు పోర్టల్‌లో ఉంచారు. మరో వారం రోజుల్లో డబ్బులు జమ అయ్యే అవకాశాలున్నాయి.

Next Story