రైల్వే ప్రయాణికులకు షాక్.. యూజర్ ఛార్జీల బాదుడు
By సుభాష్ Published on 18 Sep 2020 4:07 AM GMTరైల్వే ప్రయాణికులకు భారత రైల్వే శాఖ షాకిచ్చింది. త్వరలో రైలు టికెట్‌తో పాటు యూజర్ చార్జీలు వడ్డించబోతున్నట్లు వెల్లడించింది. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించి ఆదాయం పెంచుకునే అంశంలో భాగంగా వీటిని వసూలు చేయబోతున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. అయితే ఈ ఛార్జీలు ఎక్కువగా ఉండవని స్పష్టం చేశారు. కానీ ఈ యూజర్ ఛార్జీలు కలుపుకొని టికెట్ రేట్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఒకసారి స్టేషన్ ఆధునీకరణ పూర్తయ్యాక యూజర్ ఛార్జీ సొమ్మును రాయితీలకు మళ్లిస్తామని తెలిపారు. కాగా, దేశంలో 7వేల రైల్వే స్టేషన్‌లలో 10 నుంచి 15 శాతం స్టేషన్లలో ఈ యూజర్ ఛార్జీలను అమలు చేయనున్నట్లు బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. విమానాశ్రయల్లో ప్రయాణికుల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లే త్వరలో రైల్వే ప్రయాణికుల నుంచి కూడా వసూలు చేయబోతున్నారు.
రైల్వేలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించిన నేపథ్యంలో టికెట్ ధరలు పెరుగుతాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో యూజర్ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా దాదాపు 50 స్టేషన్లను ఆధునీకరించాలన్న భావనలో రైల్వే శాఖ ఉంది. ఈ క్రమంలో ఆయా స్టేషన్ల కింద ఉన్న భూములను 60 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వలని ఆలోచిస్తుంది. ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్‌లను రైలోపోలీస్‌గా పిలుస్తారు.