రైల్వే శాఖ కొత్త మార్గదర్శకాలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకే..!

By సుభాష్  Published on  16 Oct 2020 10:23 AM GMT
రైల్వే శాఖ కొత్త మార్గదర్శకాలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకే..!

దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో ఉన్నందున రైల్వేశాఖ మరిన్ని రైళ్లను నడిపేందుకు సిద్ధమవుతోంది. దసరా, దీపావళి పండగల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది రైల్వేశాఖ. రైళ్లల్లో ప్రయాణించే వారు కోవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలని, స్టేషన్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి ప్రయాణం ముగిసే వరకు మాస్క్‌ ధరించే ఉండాలని స్పష్టం చేసింది. కాగా, దసరా పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఈనెల 20 నుంచి ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.

ప్రయాణికులు రైల్వే స్టేషన్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి తమ గమ్యస్థానానికి చేరుకుని మళ్లీ స్టేషణ్‌ దాటే వరకు మాస్క్‌ తప్పనిసరి అని, రైళ్లల్లో, స్టేషన్‌లలో ఉమ్మి వేయడం, ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలను పడేయడం కూడా నిషేధమని తెలిపింది. ఇక కోవిడ్‌ పాజిటివ్‌ తేలిన వారు, పరీక్షలకు శాంపిళ్లు ఇచ్చిన వారు కూడా తమ ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచించింది. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించినవారికి రైల్వే చట్టం కింద జైలు శిక్ష లేదా జరిమానా, లేదా రెండు ఉండవచ్చని రైల్వే శాఖ హెచ్చరించింది. లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన రైళ్లు.. మళ్లీ పట్టాలెక్కనున్నాయి.

Next Story
Share it