పుల్వామా దాడులు జరిగి ఏడాది అవుతున్నా ఇంకా దాడి పై చేపట్టిన దర్యాప్తులో ఏం విషయాలు తేలాయో కేంద్రం తెలుసుకోలేక పోయిందని విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. అమరవీరులను స్మరించుకుంటూ..ఆయన ఆర్మీ అమరులకు నివాళులర్పించారు. ఈ దాడి వల్ల ఎవరికి ఎక్కువ ప్రయోజనం జరిగిందంటూ ఆయన ట్విట్టర్ వేదికగా కేంద్రంపై ప్రశ్నలు సంధించారు.

పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది సీఆర్పీఎఫ్ అమర జవాన్లను ఈ రోజు స్మరించుకుంటున్నాం. ఈ సందర్భంగా కేంద్రాన్ని అడగాల్సిన మూడు ప్రశ్నలు..
1.పుల్వామా దాడి ఘటనతో ఎవరికి ఎక్కువ ప్రయోజనం చేకూరింది ?
2.దాడిపై చేపట్టిన దర్యాప్తులో ఏం తేలింది ?
3.దాడికి కారణమైన భద్రతా లోపాలకు బీజేపీ ప్రభుత్వంలో ఎవరు బాధ్యత వహిస్తున్నారు ?
అని రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.

2019, ఫిబ్రవరి 14వ తేదీన సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు చేసిన దాడితో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడి ఘటన మన దేశ భద్రత, నిఘా వర్గాలపై మనకే అనేక సందేహాలు వచ్చేలా చేసింది. అలాగే మరోవైపు ఇటీవల ఉగ్రవాదులకు సహాయం చేస్తూ పట్టుబడిన కాశ్మీర్ పోలీస్ అధికారి దవీందర్ సింగ్ కు కూడా పుల్వామా దాడితో సంబంధాలున్నాయని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో..రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ మరోసారి రాజకీయ వివాదానికి తెరలేపేలా కనిపిస్తోంది.

ఇప్పటికే వచ్చిన ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ పతనం దాదాపు ఖరారైపోయింది. ఇలాంటి వైఫల్యాలతో 4 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం కష్టమనే చెప్పాలి.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.