రఫేల్ ను తీసుకొస్తున్న పైలెట్ ప్రత్యేకత ఏమిటంటే?

By సుభాష్  Published on  29 July 2020 11:58 AM IST
రఫేల్ ను తీసుకొస్తున్న పైలెట్ ప్రత్యేకత ఏమిటంటే?

కదన రంగంలో శత్రువుకు చుక్కలు చూపించే యుద్ద విమానంగా అభివర్ణించే రఫేల్ మరికొద్ది గంటల్లో దేశానికి రానుంది. దాదాపు ఏడు వేల కిలోమీటర్లు ప్రయాణించి.. గల్ఫ్ లో సేద తీరిన ఈ యుద్ధ విమానం ఈ రోజు మన గడ్డ మీద ల్యాండ్ కాబోతున్న సంగతి తెలిసిందే. భద్రతా కారణాలతో రఫేల్ ఫోటోలు తీయకూడదని భారత్ సర్కారు ఆంక్షలు విధించింది.

ఇంతకీ భారత్ కు వస్తున్న ఐదు రఫేల్ యుద్ధ విమానంలో మొదటి రఫేల్ కు పైలెట్ గా వ్యవహరిస్తున్న వ్యక్తి ఎవరు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి సమాధానం వెతికితే..మరింత ఆసక్తికమైన విషయాలు బయటకు వచ్చాయి. రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి భారత్ పైలెట్ గా ఎయిర్ కమాండర్ హిలాల్ అహ్మద్ రాథోడ్ చరిత్ర సృష్టించారు.

భారత వైమానిక దళ అధికారిగా అతనికున్న ట్రాక్ రికార్డు అంతా ఇంతా కాదు. ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా మిరేజ్ 2000.. మిగ్ 21.. కిరణ్ యుద్ధ విమానాలపై మూడు వేల గంటల ఫ్లైయింగ్ ఆవర్స్ ను విజయవంతంగా పూర్తి చేసిన ఘనత ఆయనది. ఇంతకీ ఆయన ఎక్కడ వాడో తెలుసా? అందులోనూ ఒక ప్రత్యేకత ఉంది. కశ్మీర్ కు చెందిన హిలాల్ దక్షిణ కశ్మీర్ లోని అనంత్ నాగ్ లో జన్మించారు.

ఆయన తండ్రి మొహమ్మద్ అబ్దుల్లా రాథోడ్ జమ్ముకశ్మీర్ పోలీస్ విభాగంలో డీఎస్పీగా పని చేశారు. తన కెరీర్ లో వాయుసేన మెడల్ మాత్రమే కాదు.. విశిష్ట సేవ మెడల్ ను ఆయన సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫ్లయింగ్ ఆఫీసర్ గా ఆయనకు మంచి పేరుంది.

ఈ కారణంతోనే రఫేల్ తొలి యుద్ధ విమానాన్ని నడిపే అవకాశాన్ని ఆయనకు ఇచ్చారు. భారత అవసరాలకు అనుగుణంగా ఈ యుద్ధ విమానాన్ని మార్చటంలోనూ ఆయన కీలకభూమిక పోషించినట్లుగా చెబుతారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత్ బలం. ఆ విషయాన్ని తాజాగా హిలాల్ ఎంపిక చెప్పకనే చెప్పేస్తుందని చెప్పాలి. ఇలాంటివి భారత్ లో మాత్రమే సాధ్యమని చెప్పక తప్పదు.

Next Story