హాజీపూర్‌ శ్రీనివాస్‌రెడ్డి తీర్పుపై సీపీ మహేష్‌ భగవత్‌ ఏమన్నారంటే..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన హాజీపూర్‌ కేసులో ఎట్టకేలకు తుది తీర్పు వెలువడింది. నల్గొండ ఫోక్సో ప్రత్యేక న్యాయస్థానం శ్రీనివాస్‌ రెడ్డికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. 2019 అక్టోబర్‌ 14 నుంచి 2020 జనవరి 17 వరకు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ మీడియాతో మాట్లాడారు. హాజీపూర్‌ వరుస హత్యల కేసులో శ్రీనివాస్‌ రెడ్డి దోషిగా తేలాడని, ముగ్గురు బాలికలను అతను అత్యాచారం చేసి హత్య చేసినట్లు రుజువైనట్లు చెప్పారు.

అభం శుభం తెలియని బాలికలను శ్రీనివాస్‌ రెడ్డి టార్గెట్‌గా చేసుకుని పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న బాలికలను లిఫ్ట్‌ ఇస్తానంటూ నమ్మించి బైక్‌పై ఎక్కించుకుని తన వ్యవసాయ బావివద్ద తీసుకెళ్లి అత్యాచారం చేసి, అపై హత్య చేసేవాడని అన్నారు. అతని వ్యవసాయ బావి వద్ద బాలిక స్కూల్‌ బ్యాగు ఆధారంగా ఈ వరుస హత్యల కేసులను చేధించినట్లు చెప్పారు. ఈ కేసు విచారణలో సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్‌ నివేదిక కీలక పాత్ర పోషించాయన్నారు. ఈ బలమైన ఆధారాలతోనే శ్రీనివాస్‌ రెడ్డి దోషిగా నిరూపించామన్నారు.

అలాగే ఏపీలోని కర్నూలులో ఓ మహిళను హత్య చేసిన కేసులో శ్రీనివాస్‌ రెడ్డి దోషి అని సీపీ పేర్కొన్నారు. ముందు నుంచే శ్రీనివాస్‌ రెడ్డిపై అనుమానం ఉండేదని, రావిరాల గ్రామం వద్ద శ్రీనివాస్‌రెడ్డిని అరెస్టు చేశామన్నారు. 100 రోజుల్లోనే చార్జ్‌షీట్‌ దాఖలు చేశామన్నారు. ఈ కేసులో బలమైన ఆధారాలు సేకరించి, సాక్ష్యాలన్నీ గట్టిగా ఉన్నందునే శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్షపడిందన్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.