సంచలన ట్వీట్ వైరల్.. ఏ ముఖ్యమంత్రి అక్కడ అడుగుపెట్టనిది అందుకేనా..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 May 2020 3:06 PM GMT
సంచలన ట్వీట్ వైరల్.. ఏ ముఖ్యమంత్రి అక్కడ అడుగుపెట్టనిది అందుకేనా..!

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమలో రసాయన వాయువు లీకై తీవ్ర అస్వస్థతకు గురైన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ కేజీహెచ్‌ పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సదుపాయాల గురించి జగన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శిస్తూ ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్‌ లీకేజీ ఘటనలో కొందరు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని జగన్‌ విచారం వ్యక్తం చేశారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, ఎవ్వరూ అధైర్య పడొద్దని అన్నారు. చనిపోయిన వారిని నేను తిరిగి తీసుకుని రాలేను కానీ మనసున్న వాడిగా మాత్రం వారికి అండగా ఉంటానని అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు, వెంటిలేటర్ మీద ఉన్న వారికి 10లక్షలు, హాస్పిటల్ వార్డుల్లో ఉన్న వారికి లక్ష రూపాయలు ఆ ప్రాంతంలో ఇబ్బందికి గురి అయిన వారికి 25 వేలు అందజేస్తామని ప్రకటించారు.

వైజాగ్ లో కేజీహెచ్ ఆసుపత్రిలోకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెళ్లడం 25 ఏళ్ల తర్వాత ఇదేనని ప్రసాద్ వి పొట్లూరి పేరిట ఉన్న ట్విట్టర్ అకౌంట్ లో ఉంది. ‘ప్రజా సంక్షేమం ప్రధానం, పదవి కాదు Thumbs up ఒక ముఖ్యమంత్రి ధైర్యం చేసి 25 సంవత్సరాల తరువాత వైజాగ్ కే.జీ.హెచ్ లోకి అడుగుపెట్టారు. 1995 లో ఎన్.టీ.ఆర్ గారు కే.జీ.హెచ్ లో అడుగుపెట్టాక పదవి పోయింది. ఆ భయంతో తరువాత ఏ ముఖ్యమంత్రీ అడుగు పెట్టలేదు.Way to go @ysjagan Garu’ అని పీవీపీ ట్వీట్ చేశారు.



ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఆ ఆసుపత్రిలో అడుగుపెట్టలేదన్న విషయం చాలా మందికి తెలీదు. ఈ విషయం తెలుసుకున్న కొందరేమో జగన్ ను పొగుడుతూ ఉంటే.. మరికొందరేమో జగన్ పదవి పోతుందని పీవీపీ గారు ఇన్డైరెక్ట్ గా అంటున్నారా అన్న అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. ఇంతకూ ఈ సంచలన ట్వీట్ చేసిన అకౌంట్.. ప్రసాద్ వి పొట్లూరి అఫీషియల్ అకౌంటా కాదా అన్నది తెలియాల్సి ఉంది.

Next Story