పీ వీ సింధు : పాతికేళ్లు నిండకుండానే పద్మభూషణ్

By రాణి  Published on  27 Jan 2020 5:24 AM GMT
పీ వీ సింధు : పాతికేళ్లు నిండకుండానే పద్మభూషణ్

“గాల్లో తేలినట్టుందే... గుండె పేలినట్లుందే...” షటిల్ రాణి పీవీ సింధు బహుశ ఇప్పుడీ పాటే పాడుకుంటూ ఉంటుంది. ఎందుకంటే పాతికేళ్లు నిండకుండానే పద్మ భూషణ్ రావడమంటే మాటలు కావు. ఆమె ఎంత ఆనందంగా ఉంటుందో, అసలామె తల్లిదండ్రులు ఎలా పరమానందపడిపోతూంటారో ఊహించుకుంటే చాలు... మన బోంట్లకు పులకరింతలు వస్తాయి. ఆఫ్టరాల్... సింధు మన పిల్ల. మన తెలుగింటి ఆడపడుచు. మన మెట్టుగూడా రైల్వే ఆఫీసర్స్ క్లబ్ లో, మన గోపీచంద్ అకాడమీలో ఆటకు మెరుగులు దిద్దుకున్న పిల్ల.

గత శనివారం ఆమెకు సూపర్ సాటర్ డే. అక్కడెక్కడో లక్నోలో బాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ ఆడుతూండగా హఠాత్తుగా వాయుతరంగాలు ఆమెకు పద్మభూషణ్ అవార్డు వచ్చిందని వాయులీనాలు వినిపించాయి. అంతే ... అప్పట్నుంచి అభినందనలు ఆగడం లేదు. ఫోన్ ఎంగేజే ఎంగేజ్. తోటి ఆటగాళ్లంతా అప్పటికప్పుడు కేక్ తెప్పించి, కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సింధు ఇప్పటికీ నమ్మలేకపోతోంది. “ఇంత గొప్ప గౌరవం నాకు ఇచ్చిన భారత ప్రభుత్వం పట్ల కృతజ్ఞురాలిని. ఇది నాకు మాత్రమే కాదు. క్రీడలే జీవితంగా బ్రతుకుతున్న యువ ఆటగాళ్లందరికీ ఇది సన్మానం లాంటిది. ఇరవై నాలుగేళ్లకే ఇంత పెద్ద అవార్డు రావడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది” అని తన ట్రేడ్ మార్కు నవ్వుతో ముఖమంతా వెన్నెలవానలు కురిపిస్తూ చెప్పింది సింధు. బాడ్మింటన్ లో పద్మ భూషణ్ పొందిన త్రయం – పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్, పీవీ సింధు – మన హైదరాబాద్ వాళ్లే కావడం ఇంకో విశేషం. ఇప్పుడీ ఆరడుగుల ఆటగత్తె పద్మభూషణ్ పొందిన అరుదైన ఆటగాళ్ల వరుసలో చేరిపోయింది. సైనా, అభినవ్ బింద్రా, నవాంగ్ గోంబు, సానియా మీర్జా, మేరికోమ్, సునీల్ గవాస్కర్, విశ్వనాథన్ ఆనంద్, కపిల్ దేవ్, పంకజ్ అద్వానీలు కూడా క్రీడల్లో తమ ప్రదర్శన కారణంగా దేశానికి పేరు తెచ్చారు. పద్మ అవార్డులు పొందారు. అయితే ఇప్పటివరకూ పద్మభూషణులందరిలోనూ సింధుదే అతిపిన్న వయసు.

అప్పట్లో ఆమె అప్పటి దేశాధ్యక్షులు ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీని పొందారు. ఇప్పుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మ భూషణ్ ను ఏప్రిల్ లేదా మే నెలలో అందుకోబోతున్నారు. పద్మశ్రీ ఒక మరువలేని జ్ఞాపకం. ఇప్పుడు పద్మభూషణ్ కూడా మరిచిపోలేని జ్ఞాపకం కాబోతోంది. సింధు 2016 రియో ఒలింపిక్స్ లో రజతం సాధించి, తన ఖాతాలో మరో అరుదైన గౌరవాన్ని వేసుకుంది. అన్నిటినీ మించి తల్లిదండ్రుల పుత్రికోత్సాహం మాత్రం చూడవలసిందే. “నాకివి గర్వించే క్షణాలు” అని తండ్రి పీవీ రమణ అన్నారు. “ఒక క్రీడాకారిణికి ఇదెంత గర్వకారణమో నాకు తెలుసు” అన్నారు తల్లి విజయ. ఇద్దరూ కూడా క్రీడాకారిణులే కావడం విశేషం.

Next Story