డియ‌ర్ మోదీజీ.. ఇట్లు మీ పూరీ జ‌గ‌న్నాధ్

By Medi Samrat  Published on  21 Oct 2019 11:40 AM GMT
డియ‌ర్ మోదీజీ.. ఇట్లు మీ పూరీ జ‌గ‌న్నాధ్

తీసే సినిమాల్లోనే కాదు చేసే పనుల్లో కూడా కొత్తదనాన్ని చూపిస్తారు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. తన గురించే కాదు.. ఎదుటి వాళ్ళ గురించి కూడా ఆలోచించే సినిమా వాళ్ళలో ముందుంటాడు పూరీ. తన పుట్టినరోజు నాడు మాజీ అసిస్టెంట్ డైరెక్టర్లకు, కోడైరెక్టర్ లకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించి తన మంచి మనసు చాటుకున్నారు.

ఇప్పుడు పర్యావరణ సమతుల్యత కోసం ఆలోచించే వ్యక్తి గా ఒక ప్రయత్నం చేశారాయన. సింగల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధం పై కొన్ని సూచనలు చేస్తూ ప్రధానమంత్రి మోదీకి బహిరంగ లేఖ రాసారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధించిన మాత్రాన పర్యావరణం ఏమి బాగు పడిపోదనీ, అందు కోసం మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. ఒకప్పుడు ప్లాస్టిక్ ని తయారు చేయడం మొదలు పెట్టిన తర్వాత చెట్లు నరకడం తగ్గిందనీ, ఇప్పుడు అదే ప్లాస్టిక్ ను ఒక్కసారిగా బ్యాన్ చేస్తే ప్రజలు అందరూ పేపర్ బ్యాగ్ లు వాడటం మొదలు పెడతారని దీనివల్ల చెట్లను ఎక్కువగా నరకాల్సింది పరిస్థితి వస్తుందన్నారు.

అయితే ఇలాంటి సమస్యల నుంచి బయట పడాలంటే మొక్కలు ఎక్కువగా నాటాలి అన్నారు.. అంతేకాదు పెరుగుతున్న జనాభా, ఇష్టం వచ్చినట్టు విషవాయువులను గాలిలోకి వదిలే ఫ్యాక్టరీలు, పొల్యూషన్ ను పెంచే పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలు ఇవన్నీ వాతావరణ సమతుల్యత దెబ్బ తీస్తున్నాయి అన్నారు. అన్నింటినీ అదుపులో పెడుతూ అప్పుడు ప్లాస్టిక్ ను బ్యాన్ చేయటం కూడా చేస్తేనే ఫలితం ఉంటుందన్నారు. మొత్తానికే ప్లాస్టిక్ ను బ్యాన్ చేయడం కంటే ఒకసారి ఉపయోగించిన ప్లాస్టిక్ నే మళ్లీ మళ్లీ ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

దీనికోసం ప్రభుత్వం రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి వాడిన ప్లాస్టిక్ ను ఇస్తే డబ్బులు ఇచ్చేలా ఒక స్కీమ్ పెడితే అద్భుతంగా ఉంటుంది అంటూ సూచించారు. దీంతో ప్రజలు వాడిన ప్లాస్టిక్ ను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా తిరిగి జాగ్రత్తగా ఆయా కేంద్రాలకు తీసుకువచ్చి అప్పగిస్తారని పూరీ తన లేఖలో ప్రధానికి సూచించారు. పూరి తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ లేఖ అభిమానుల మనసులు దోచుకుంది. ఈ విషయంపై మోదీ కూడా ఆలోచిస్తే బాగుంటుంది కదూ..!



Next Story