పాండవుల రాజధానికి జస్ట్ రూ. 10 లక్షలు కావాలి

By రాణి  Published on  25 Jan 2020 10:36 AM GMT
పాండవుల రాజధానికి జస్ట్ రూ. 10 లక్షలు కావాలి

జస్ట్ పది లక్షలు... జస్ట్ పది లక్షలు మన దగ్గరుంటే చాలు పాండవుల రాజధాని ఇంద్రప్రస్థానికి దేశరాజధాని ఢిల్లీ లోని పురానా ఖిల్లాకి మధ్య ఉన్న సొరంగ మార్గాన్ని కనుగొనవచ్చు. కానీ మన పురాతత్వ శాఖ వద్ద ఆ పది లక్షల రూపాయలు లేవు. అందుకే ఆ పనిని నిలుపు చేశారు. ఈ పని కోసం కేటాయించిన పది లక్షల రూపాయలను పురాతత్వ శాఖ మరో పనికి బదలాయించింది. అంతే పది లక్షలు లేవు. పని ఆగిపోయింది.

పురానా ఖిల్లా నుంచి పాండవుల ప్రాచీన రాజధాని ఇంద్రప్రస్థానికి సొరంగ మార్గముందని కథనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 2018 లో ఆర్కియాలజిస్ట్ వసంత్ స్వర్ణకార్ నాయకత్వంలో తవ్వకాలు మొదలయ్యాయి. కానీ అంతలోనే పని ఆగిపోయింది. ఆ తరువాత మళ్లీ 2019 నవంబర్ లో తవ్వకాలు మొదలయ్యాయి. దీనికి పది లక్షలు కేటాయిస్తే అవి పక్కదారి పట్టాయి. దీంతో పని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఆగిపోయింది.

నిజానికి పాండవుల రాజధాని ఇంద్రప్రస్థ ఉన్న చోటే పురానా కిలా ను నిర్మించారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పాత కోటను షేర్ షా సూరి నిర్మించాడు. దీనిని అక్బర్ తండ్రి హుమాయూన్ మరింత మెరుగుపరిచాడు. అయితే ఈ ప్రాంతంలో పాండవుల తాలూకు అవశేషాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గట్టిగా నమ్ముతున్నారు. ఈ మేరకు 1955 లో తొలి సారి పరిశోధనలు జరిగాయి. ఆ తరువాత 1968 నుంచి 1972 వరకూ రెండో సారి తవ్వకాలు జరిగాయి. ఆ తరువాత మూడో సారి జనవరి 9, 2014 లో జరిగాయి. ఇప్పుడు తాజా పరిశోధనలు జూన్ 30, 2014 నుంచి జరుగుతున్నాయి. తవ్వకాల్లో కొడవళ్లు, పెంకులు, బొమ్మలు, ఇటుకలు, గిన్నెల వంటివి దొరికాయి. ఇవన్నీ పురానా కిలా మ్యూజియంలో భద్రంగా ఉన్నాయి.

ఇప్పుడీ పరిశోధనలన్నీ పది లక్షల కోసం ఆగిపోయి ఉన్నాయి.

Next Story