పుల్వామా ఉగ్రదాడి: పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు
By సుభాష్
ముఖ్యాంశాలు
► ఎన్‌ఐఏ విచారణలో కీలక విషయాలు
► పేలుడు పదార్థాలన్నీ ఆన్‌లైన్‌లోనే కొనుగోలు
► కోర్టులో కీలక కుట్రదారి షకీర్ బషీర్
గత ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామాలో ఉగ్రదాడి జరిగి సుమారు 40 మంది జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే. పాక్ కేంద్రంగా పని చేస్తున్న జైషే ఉగ్రవాది సంస్థకు చెందిన షకీర్ బషీర్ మాగ్రేను ఎన్‌ఐఏ పోలీసులు అరెస్ట్ చేయడంతో దాడికి సంబంధించిన పలు షాకింగ్ నిజాలు బయటపడ్డారు. కాగా, శుక్రవారం ఆయనను కోర్టులో హాజరు పర్చారు. అయితే పోలీసులు జరిపిన విచారణలో సంచలన నిజాలు బయటపడ్డాయి. పుల్వామా దాడికి కావాల్సిన పేలుడు పదార్థాలను షకీర్‌బషీర్ ఆన్‌లైన్‌లో ఖరీదు చేసినట్లు పోలీసులు జరిపిన విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఐఈడీ బాంబు తయారీ కోసం అమోనియం నైట్రేట్, నైటరో గ్లిజరిన్, ఆర్డీఎక్స్ లాంటి పదార్థాలను ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేసినట్లు షకీర్ విచారణలో తెలిపాడు. బ్యాటరీని, అమోనియం నైట్రేట్‌ను ఓ పోర్టల్ ద్వారా కొనుగోలు చేసినట్లు తెలిపాడు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను పేల్చేందుకు తీసుకువచ్చిన మారుతీ ఏకో కారును కూడా దాడి ప్రాంతానికి 500 మీటర్ల దూరం వరకు తానే డ్రైవింగ్ చేసినట్లు షకీర్ బషీర్ అంగీకరించాడు.
ఆ తర్వాత అదిల్ అహ్మద్ దార్ ఆ కారుతో జవాన్ల వాహనాన్ని ఢీకొట్టాడు. ఇద్దరు జైషే ఉగ్రవాదులకు 2018లో ఆశ్రయం కల్పించినట్లు పోలీసుల విచారణలో చెప్పాడు. పుల్వామా దాడిలో పాక్‌కు చెందిన ఉమర్ ఫారూక్, కమ్రాన్‌లు కూడా కుట్ర పన్నినట్లు తేలింది. సుమారు 80 కిలోల ఆర్డీఎక్స్ తో ఈ దాడికి పాల్పడ్డారు. కాగా, పాకిస్తాన్‌లో ఖరీదు చేసిన ఈ పేలుడు పదార్థాలను ఎల్వోసీ రూట్లో భారత్‌కు తీసుకువచ్చినట్లు తేలింది. కాగా, న్యాయస్థానం అతనికి 15 రోజులు రిమాండ్ విధించింది.
పూల్వామా దాడిలో షకీర్ బషీర్ కీలక కుట్రదారి
పుల్వామా దాడిలో షకీర్ బషీర్ కీలక కుట్రదారిఅని ఎన్‌ఐఏ పేర్కొంది. అయితే మహమ్మద్ ఉమర్ సలహా మేరకు షకీర్ బషీర్ మాగ్రే జమ్మూకశ్మీర్ జాతీయ రహదారిపై 2019 జనవరిలో సీర్పీఎఫ్ కాన్వాయ్ కదలికలను గమనించడం మొదలు పెట్టాడు. సైనికుల కాన్వాయ్‌కి సంబంధించి సమాచారం ఎప్పటికప్పుడు మహమ్మద్ ఉమర్, ఆదిల్ అహ్మద్‌లకు చేరవేసేవాడు. పేలుడుకు ఉపయోగించిన వాహనానికి మార్పులు చేయడం, వాహనానికి ఐఈడీ పేలుడు పదార్థాలను అమర్చడంలోనూ షకీర్ కీలక పాత్ర పోషించినట్లు షకీర్ విచారణలో ఎన్‌ఐఏ వెల్లడించింది