జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ అధినేత మసూద్‌కు పాక్ ఆశ్రయం కల్పిస్తోంది: భారత్
By సుభాష్ Published on 29 Aug 2020 7:30 AM ISTపుల్వామా ఉగ్రదాడి కేసులో ప్రధాన నిందితుడైన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్‌కు పాకిస్థాన్ ఆశ్రయం కల్పిస్తూనే ఉందని భారత్ ఆరోపించింది. పాక్‌కు సరైన ఆధారాలు సమర్పించినప్పటికీ అజార్‌కు ఆ దేశం మద్దతు ఇస్తూనే ఉందని భారత విదేశాంగ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. 2008 ముంబాయి దాడులకు పాల్పడిన వారిని వెనక్కి వేసుకొచ్చినట్లే మసూద్ అజార్ విషయంలోనూ పాకిస్థాన్ అలానే ప్రవర్తిస్తోందని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
155 మంది విమాన ప్రయాణికులను హైజాక్ చేసిన తర్వాత, వారిని విడిపించుకునే క్రమంలో భారత్ జైలు నుంచి విడుదలైన మసూద్, 2000సంవత్సరంలో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థను స్థాపించాడని తెలిపింది. 2019 ఫిబ్రవరి 14లో పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇప్పటికే ఆరుగురు అదుపులో ఉండగా, అజార్ ప్రధాన నిందితుడు. అయితే అతని సోదరుడు అబ్దుల్ రవూఫ్, మరణించిన ఉగ్రవాది మహ్మద్ ఫరూఖ్, ఆత్మాహుతి దళ సభ్యుడు అదిల్ అహ్మద్‌దార్, అల్వీ, ఇస్మాయిల్ తదితర పాక్‌కు మూలాలున్న వారిపై ఇటీవల ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
పుల్వామలో భద్రతా బలగాలపై జరిగిన ఘటనలో 40 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. దీనికి తామే బాధ్యులమని జైషే మహ్మద్ ఉగ్రవాదులు ప్రకటించారు. ఈ ఉగ్ర సంస్థ పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఇంత జరుగుతున్నా.. మసూద్ అజార్‌కు పాక్ ఆశ్రయం కల్పిస్తోందని భారత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.