ఢిల్లీలో హెల్త్ ఎమర్జెన్సీ : పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతున్న ఉపగ్రహ చిత్రాలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Nov 2019 3:27 PM ISTపర్యావరణ కాలుష్యం (నియంత్రణ మరియు నివారణ) మండలి (ఇ.పి.సి.ఎ) ఢిల్లీలో ప్రజారోగ్య ఆత్యయిక పరిస్థితిని ప్రకటించింది. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో సాగు భూముల్లో వ్యర్థాలను మండించడంవల్ల కలిగిన వాయుకాలుష్యం ఢిల్లీలో గాలిలో ధూళిని, కర్బన సాంద్రతను విపరీతంగా పెంచడంవల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ ఐదో తేదీవరకూ పాఠశాలలను మూసివేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అదేశాలు జారీచేశారు.
నవంబర్ మూడో తేదీన మొదలైన బంగ్లాటీమ్ టూర్ కూడా కష్టతరంగానే సాగుతోంది. వాయు కాలుష్యం కారణంగా ఆటగాళ్లు మాస్క్ లు ధరించి మరీ అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రాక్టీస్ చేయాల్సిన పరిస్థితి తప్పలేదు.
దీపావళి పండుగ తర్వాత పరిస్థితి మరింత విషమించింది. దీనివల్ల రాష్ట్రంలో ప్రజారోగ్య ఆత్యయిక పరిస్థితిని విధించారు. దాదాపుగా 13 లక్షల కిలోమీటర్ల దూరం పూర్తిగా పొగతో, పొగమంచుతో కప్పబడి ఉన్నట్టుగా ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపుగా ఫ్రాన్స్ దేశానికి రెండింతలు ఉన్న ఉత్తర భారతం ఈ పరిస్థితిలో కూరుకుపోవడానికి గల కారణాలను తరచిచూస్తే కడుపు తరుక్కుపోతుంది. కోట్లమంది జనాభా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. బయట కాలుపెట్టాలంటే భయంగా ఉంది జనానికి.
పొగతో, పొగమంచుతో కప్పబడిన ప్రాంతం
పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని వ్యవసాయ భూముల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంవల్ల ఏర్పడిన పొగ దట్టంగా అలముకొని, వాతావరణాన్ని కలుషితం చేయడమే ఢిల్లీకి ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడానికి ప్రధాన కారణం. పూర్తిగా ఈ పొగ మొత్తం ఉత్తరభారతాన్నంతటినీ అలముకోవడమే కాక దక్షిణ భారతానికి కూడా పాకడం ఆందోళనకరమైన అంశం. గాలిలో ధూళి బాగా పెరిగిపోవడంతో జనం పూర్తిగా మాస్కులు ధరించి బయట తిరుగుతున్నారు. ఎంతో అవసరమైతే తప్ప సామాన్యులు రోడ్లమీద కాలుపెట్టలేని పరిస్థితి నెలకొని ఉండడం అత్యంత విచారకరం.
తాజా సమాచారం ప్రకారం, వాతావరణ శాఖ అందించిన గణాంకాల ప్రకారం ఢిల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దాదాపు 800 దాటిపోవడంతో ఊపిరి తీసుకునే పరిస్థితి లేక జనం అల్లాడిపోయారు. ఈ ప్రమాణం 500 దాటితే అత్యవసర పరిస్థితికింద లెక్క. మరో నాలుగైదు రోజులవరకూ ఢిల్లీకి ఈ పరిస్థితిని ఎదుర్కోక తప్పదని వాతావరణ శాఖ నిపుణుల అంచనా.
గడచిన ఐదేళ్లలో ఢిల్లీలో వాయుకాలుష్యాన్ని వీలైనంతగా తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్ , హర్యానా ప్రభుత్వాలకు, రైతులు వ్యవసాయ భూముల్లో వ్యర్థాలకు తగలబెట్టకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ పరిస్థితిని ముందే ఊహించిన ఢిల్లీ ప్రభుత్వం 50 లక్షల మాస్కులను ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో పంచింది. భారత్ - బంగ్లా టి20 మ్యాచ్ ని వీక్షించేందుకు వచ్చే క్రికెట్ అభిమానులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వాయుకాలుష్యంవల్ల ఢిల్లీ పూర్తిగా గ్యాస్ ఛాంబర్ లా మారిపోయింది.
కాలుష్యం అధికంగా ఉన్నప్పటికీ ముందుగా నిర్దేశించిన సమయంలో, నిర్దేశిత ప్రణాళిక ప్రకారమే టి20 సిరీస్ జరుగుతుందని బి.సి.సి.ఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించారు. పరిస్థితికి అనుగుణంగా ఆటగాళ్లుకూడా మాస్క్ లు ధరించి స్టేడియంలోకి వస్తూ సహకరిస్తున్నారు. ఊపిరి తీసుకోవడం భారంగా ఉండడం, గొంతునొప్పి తప్ప మరీ ప్రాణాలు పోయేంత ఇబ్బందేం లేదని బంగ్లా ఆటగాళ్లు అంటున్నారు. ఈ కారణంగా సిరీస్ ను ముందుకు తీసుకెళ్లడానికి బంగ్లా ఆటగాళ్లుకూడా అంగీకరించారు.
నిజానికి ఢిల్లీలో ఈ స్థాయిలో పెరిగిపోయిన కాలుష్యంపైనే క్రికెట్ మ్యాచ్ మీదకంటే ఎక్కువ దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని మాజీ క్రికెటర్, తూర్పు ఢిల్లీ పార్లమెంట్ సభ్యుడు గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి ఢిల్లీ ప్రజలు క్రికెట్ మ్యాచ్ కంటే కాలుష్యంమీదే ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారని, ఎప్పుడు పొగ, పొగమంచు ఢిల్లీని పూర్తిగా విడిచిపెడతాయా అని ఎదురుచూస్తున్నారని అన్నారాయన.
సెంటినల్ 2 ఉపగ్రహంద్వారా ఉత్తర్ ప్రదేశ్ లోని మొరాదాబాద్ ప్రాంతంలో వ్యవసాయ భూముల్లో కాలుతున్న
పంట వ్యర్థాల చిత్రాలు
హర్యానా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యవసాయ దారులు సాగు భూముల్లో పంట వ్యర్థాలను కాల్చడంవల్ల ఏర్పడిన కాలుష్యం ఢిల్లీ జనజీవనాన్ని పూర్తి స్థాయిలో స్తంభింపజేసింది.
�