ప్రాణం తీసిన పబ్జీ
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Sept 2019 10:44 AM IST
విశాఖపట్నం: వీడియో గేమ్స్ యువత పాలిట యమ పాశాలుగా మారుతున్నాయి. ఆన్ లైన్ లో పబ్జీ గేమ్ కు 15 ఏళ్ల యువకుడు ఆడిక్ట్ అయ్యాడు. 10వ తరగతి చవుతున్న లోహిత్ పబ్జీ గేమ్ లో మునిగిపోయేవాడు.
పదవ తరగతి చదువుతున్న బోయ లోహిత్ అనే 15 ఏళ్ల బాలుడు తన తల్లిదండ్రుల మొబైల్ ఫోన్ లో పబ్జీ గేమ్ ఆడుతూ ఆ ఆటకు బానిసయ్యాడు. పరీక్షలు దగ్గర పడుతుండటంతో పబ్జీని మానుకొని చదువుపైన శ్రద్ద చూపాలని లోహిత్ ని తల్లిదండ్రులు మందలించారు.
ఎంతకూ వినకపోవడంతో గత పది రోజుల క్రితం బాలుడి వద్దనుండి మొబైల్ ఫోన్ లాక్కున్నారు. అదే రోజు సాయంత్రం కూరగాయలు కొనడానికి బాలుడి తల్లిదండ్రులు బజారుకు వెళ్లారు. పబ్జీ గేమ్ ఆడనివ్వడం లేదని అప్పటికు లోహిత్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంటిలో ఎవరూలేనిది చూసి చీమలు మందు మంచినీళ్లలో కలుపుకుని తాగేశాడు. రైతు బజార్ నుంచి వచ్చిన లోహిత్ తల్లిదండ్రులు షాక్. చీమల మందు తాగిన లోహిత్ అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
లోహిత్ ను గాజువాకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యంకోసం మరో కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. మళ్లీ అక్కడ నుంచి వైజాగ్ లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. బాలుడు చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించాడు. ఈ ఘటన వైజాగ్ లోని న్యూ పోర్ట్ పీఎస్ పరిధిలో జరిగింది.
న్యూపోర్ట్ పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారి కేసీ నాయుడు మాట్లాడుతూ ..ఆన్లైన్ గేమ్స్ చాలా ప్రమాదకరం అన్నారు. సరదాతో మొదలైన పబ్జీ వంటి ఆన్లైన్ గేమ్స్ యువతను బానిసలుగా మారుస్తున్నాయన్నారు. 2019 మార్చ్14న నెలలో దేశంలోని వివిధ రాష్ట్రాలలో పబ్జీని నిషేధించారు. మొబైల్ ఫోన్లలో పిల్లలు ఏంచేస్తున్నారో తల్లిదండ్రులు ఓ కంట కనిబెడుతూ ఉండాలన్నారు. " తల్లిదండ్రులు పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వొద్దని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.