భగ్గుమన్న 'ఓయూ' క్యాంపస్
By సుభాష్ Published on 18 Jan 2020 10:01 AM GMT
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ మరోసారి భగ్గుమంది. ప్రొఫెసర్ కాశీంను పోలీసులు అరెస్ట్ చేశారు. క్యాంపస్‌లో ఉన్న ఆయన నివాసంలో పోలీసులు ఐదు గంటలకుపైగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రొఫెసర్ కాశీంను అరెస్ట్ చేశారు. కాగా, ఆస్పత్రిలో కాశీంకు వైద్య పరీక్షల అనంతరం గజ్వేల్‌కు తరలిస్తున్నట్లు సమాచారం.
పోలీసుల సోదాల నేపథ్యంలో కాశీం అరెస్ట్ పై ఆయన భార్య స్పందించారు. ఐదు సంవత్సరాల క్రితం గజ్వేల్‌లో పోలీసులు సోదాలు నిర్వహించారని, 2016లో అక్రమంగా పెట్టిన కేసులోఇప్పుడు అరెస్టు చేశారన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే తమపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. శనివారం ఉదయం గజ్వేల్ ఏసీపీ నారాయణ నేతృత్వంలో సోదాల కోసం వచ్చిన పోలీసులు.. ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వచ్చారని, కంప్యూటర్‌కు సంబంధించిన హార్డ్ డిస్కులు, ఇతర పుస్తకాలు తీసుకెళ్లారన్నారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టును ఆశ్రయిస్తానని ఆమె అన్నారు. కాగా, ప్రొఫెసర్ ఇంటి దగ్గరకు వెళ్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతోనే..
ప్రొఫెసర్‌కు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. 2016లో కాసీంపై నమోదైన కేసులో భాగంగానే పోలీసులు ఈ తనిఖీలు జరిపినట్లు సమాచారం. ములుగు పోలీసుస్టేషన్ పరిధిలో నమోదైన కేసులో కాశీం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఆయన కారులో విప్లవ సాహిత్యం పుస్తకాలు దొరికినట్లు తెలుస్తోంది. కాశీం ఇటీవల విప్లవసంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు.