శ్రావణి ఆత్మహత్య కేసు: నిర్మాత అశోక్‌రెడ్డి అరెస్ట్‌

By సుభాష్  Published on  16 Sept 2020 12:18 PM IST
శ్రావణి ఆత్మహత్య కేసు: నిర్మాత అశోక్‌రెడ్డి అరెస్ట్‌

టీవీ సీరియల్‌ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న ఆర్‌ఎక్స్‌ 100 సినిమా నిర్మాత అశోక్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. శ్రావణి ఆత్మహత్య కేసులో ప్రధాని నిందితులైన ముగ్గురిలో దేవరాజ్‌, సాయికృష్ణలను ఇది వరకే పోలీసులు అరెస్టు చేయగా, మరో నిందితుడు అశోక్‌రెడ్డి పరారీలో ఉన్నాడు. ఈ కేసులో ఏ2గా చేర్చిన పోలీసులు.. అశోక్‌రెడ్డికి ముందుగానే నోటీసులు ఇచ్చారు. సోమవారం ఎస్‌ఆర్‌ నగర్ పోలీసు స్టేషన్‌కు వస్తానని చెప్పిన అశోక్‌ రెడ్డి ఇంత వరకు హాజరు కాలేదు. పైగా సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు కూడా అశోక్‌రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సినీ రంగంలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి శ్రావణిని లొంగదీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆమె దేవరాజ్‌కు దగ్గర కావడాన్ని అశోక్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయాడు. సాయికృష్ణ ద్వారా ఒత్తిడి తీసుకువచ్చి ఇద్దరూ విడిపోయేందుకు సహకరించినట్లు సమాచారం. సెప్టెంబర్‌ 7న అమీర్‌పేట్‌ హోటల్‌ వద్ద శ్రావణి, దేవరాజ్‌తో గొడవ అనంతరం సాయికృష్ణ ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న అశోక్‌ రెడ్డి అందరూ కలిసి శ్రావణిని శారీరకంగా హించించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ముందు రోజు జరిగిన వ్యవహారంలో అశోక్‌రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. పరారీలో ఉన్న అశోక్‌రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు.

Next Story