మన వాళ్లపై కూడా కాస్త ప్రేమ చూపు ప్రియాంక..!-రంగోలి చందేల్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Sept 2019 6:40 PM ISTఇండియాలో కూడా చాలా మంది పర్యావరణ ప్రేమికులు ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం వారు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రియాంక చోప్రా గుర్తు పెట్టుకుంటే మంచిదంటూ కంగనా రనౌత్ సిస్టర్ రంగోలి చందేల్ అన్నారు. భారతదేశంలోని ప్రకృతి ప్రేమికులపై కూడా ప్రేమ చూపించాలని ప్రియాంక చోప్రాకు చందేలి హితవు పలికారు. అసలు విషయానికి వస్తే....
వాతావరణంలోని మార్పులపై స్వీడన్‌కు చెందిన 16 ఏళ్ల అమ్మాయి యూఎన్‌ఓ వేదికగా ప్రసంగించిన సంగతి తెలిసిందే. యూఎన్‌ఓలో ప్రపంచ దేశాల అధినేతలను గ్రెటా ధంబర్గ్ నిలదీసింది. ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా పత్రికలు ప్రముఖంగా రాయడం జరిగింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. "మా భవిష్యత్తును నాశనం చేయడానికి మీరెవ్వరూ. హౌ డేర్ యూ అంటూ " ఆమె ప్రపంచ దేశాల అధినేతలను ఐక్యరాజ్యసమితి సాక్షిగా ప్రశ్నించింది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది స్పందించారు. ప్రశంసలు వెల్లువెత్తాయి.
ఈ సందర్భంగా ప్రియాంక కూడా గ్రెటాను ప్రశంసించారు. గ్రెటాను ఉద్దేశించి ట్విట్ చేశారు. ‘మీ తరాన్ని ఒక వేదిక మీదకు తెచ్చి పర్యావరణ రక్షణ విషయంలో మా తరం చేస్తున్న నిర్లక్ష్యం గురించి ముఖంపై గుద్దినట్లు చెప్పినందుకు థ్యాంక్స్ . పర్యావరణ మార్పులపై మేం ఇంకా బాగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకతను చెప్పినందుకు అభినందనలు. అవును మిమ్మల్ని ఓడించడానికి మాకెంత ధైర్యం? మనం బతకడానికి చివరకు మనకు ఈ ఒక్క గ్రహం మాత్రమే ఉంది’ అంటూ గ్రెటాను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఇక వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో ఉండే రంగోలి తాజాగా ప్రియాంక ట్వీట్‌పై స్పందించారు.
‘డియర్ ప్రియాంక చోప్రా.. అవును పర్యావరణ పరిరక్షణకై ఆ యువతి చాలా గొప్ప ప్రసంగాలు చేస్తున్న మాట నిజమే. అయితే మన దేశంలో కూడా ఇలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. పర్యావరణం కోసం మనసా వాచా కర్మణా పనిచేస్తూ డబ్బు కూడా దానం చేస్తున్నారు. వాళ్లు కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా ఫలితాలు సాధించి చూపిస్తున్నారు.
అలాంటి వాళ్లపై కూడా కాస్త ప్రేమ కురిపించండి ప్రియాంక బాగుంటుంది’అంటూ ప్రియాంకపై రంగోలి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా కావేరీ కాలింగ్ అనే పర్యావరణ కార్యక్రమం కోసం రంగోలి సోదరి కంగనా రూ. 42 లక్షలు దానం చేసిన సంగతి తెలిసిందే. కావేరీ బెల్ట్‌లో చెట్లు నాటే ఈ ఉద్యమానికి లియోనార్డో డికాప్రియో వంటి పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా మద్దతు ప్రకటించారు.