విలయ తాండవం చేస్తున్న  కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఉన్న ఒకే ఒక మార్గం షట్ డౌన్. ప్రయాణాలపై ఆంక్షలు, సామూహిక కార్యకలాపాలపై నిషేధాలు, సామాజిక దూరం పాటించడాలు, స్వీయ నిర్బంధాలు, లాక్‌డౌన్‌, స్టే ఎట్‌ హోమ్‌ వంటి చర్యలతో ప్రపంచ వ్యాపితంగా ప్రజా జీవనానికి తీవ్ర అంతరాయమేర్పడుతోంది. గ్లోబల్‌ షటింగ్‌డౌన్‌కు  చేరువ అవుతోంది. సేవల రంగం, వ్యాపారాలు, ఉపాధి దెబ్బతినిపోతుండడంతో. కార్మికులు ముఖ్యంగా అసంఘటిత రంగంలో పని చేస్తున్నవారి పరిస్థితి దుర్భరంగా తయారైంది.

ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ఇటలీలోనే కరోనా మృతులు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. అమెరికాలో ఇంతవరకు 200కు పైగా మరనించారు. బ్రిటన్‌లో ఈ మృతుల సంఖ్య 167కు చేరింది. స్పెయిన్‌లో వెయ్యికి పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. ఇటలీ, చైనా, ఇరాన్‌ తరువాత కరోనా మృతులు అత్యధికంగా చోటుచేసుకున్న దేశం స్పెయిన్‌ కాగా . జర్మనీలో సైతం కరోనా ఉధృతి ఎక్కువగా ఉంది. ప్రపంచ కరోనా మృతుల సంఖ్య మొత్తంగా 10,000 దాటింది. నిర్ధారణ అయిన కరోనా కేసుల సంఖ్య 2,50,000కు పెరిగింది. వీటిలో 86వేల కేసుల్లో రోగులు రికవరీ అయ్యారు.

కరోనా ఇప్పట్లో సమసిపోయేలా లేదని, ఇది పూర్తిగా అదుపులోకి రావడానికి కనీసం ఒక ఏడాది పట్టొచ్చని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అన్నారు. పబ్‌లు, రెస్టారెంట్లు, జిమ్‌లు, విశ్రాంతి మందిరాలను మూసివేయాలని బ్రిటన్‌ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండడంతో రిటైర్డు అయిన వైద్యులను, నర్సులను రంగంలోకి దింపింది. అమెరికాలోని న్యూయార్క్‌లో కరోనా విజృంభించడంతో కాలిఫోర్నియా అప్రమత్తమైంది. నాలుగు కోట్ల మంది జనాభా వున్న ఈ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. సామాజిక దూరం పాటించాలని, అనవసర ప్రయాణాలను మానుకోవాలని  ‘స్టే ఎట్‌ హోమ్‌’ ఉత్తర్వులు జారీ చేశారు.  ఇక చైనాలో వరుసగా రెండో రోజు కూడా కొత్త కేసు ఒక్కటీ నమోదు కాలేదు. లాటిన్‌ అమెరికా దేశమైన బ్రెజిల్‌లో కరోనా దెబ్బకు ఆరుగురు చనిపోయారు.. మరో లాటిన్‌ అమెరికా దేశం అర్జెంటీనాలో దేశ వ్యాపిత లాక్‌డౌన్‌ విధించారు. కరోనా దెబ్బకు ఇటలీలో తాజాగా మరో 627 మంది చనిపోవడంతో ఆ దేశంలో మొత్తం మృతుల సంఖ్య 4,032కు పెరిగింది.

కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు చాలా దేశాలు చేసిన మొట్టమొదటి పని సరిహద్దులు మూసేయడం. చైనా తో సహా కొన్ని దేశాలు సంపూర్ణంగా దీన్ని అమలు చేస్తే, భారత్ వంటి దేశాలు పాక్షికంగా అమలు చేశాయి. ఆఫ్రికా, తూర్పు ఆసియాలోని కొన్ని దేశాలు మినహాయిస్తే అన్ని దేశాలు కూడా సంపూర్ణంగానో, పాక్షికంగానో సరిహద్దులను మూసేశాయి. ఆస్ట్రేలియా మార్చి 19 నుంచి దేశ సరిహద్దులను మూసివేసింది. దేశ పౌరులను మాత్రమే విదేశాల నుంచి తిరిగివచ్చేందుకు అనుమతించింది. విదేశీ ప్రయాణాలను రద్దు చేసుకోవాల్సిందిగా పౌరులకు సూచించింది. ఆస్ట్రేలియా చరిత్రలో ఈ విధమైన ట్రావెల్ బ్యాన్ ఇదే మొదటిసారి.

భారత్ పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ మార్చి 16నే ఫ్లైట్ బ్యాన్ అమలు చేసింది. యూకే మినహా అన్ని యురోపియన్ దేశాలకు విమాన ప్రయాణాలను నిలిపివేసింది. పాకిస్థాన్ విషయానికి వస్తే భూ సరిహద్దులను మూసేసింది. అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. ఇరాన్ కు ఇప్పటికే విమాన రాకపోకలను నిషేధించింది. కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్ ల నుంచి మాత్రమే అంతర్జాతీయ ప్రయాణాలను అనుమతిస్తున్నారు. శ్రీలంక మార్చి 17 నుంచి విదేశీ విమానాల రాకపోకలను నిలిపివేసింది. మరెన్నో దేశాలు ఇదే బాటలో పయనించాయి. ఇప్పుడు తాజాగా వివిధ దేశాలు ఇప్పడు తమ భూభాగాల్లో ప్రజల రాకపోకలను నియంత్రించడంపై దృష్టి పెడుతున్నాయి.

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.